చల్లారని ‘కారు’చిచ్చు | TRS Rebels In Adilabad District | Sakshi
Sakshi News home page

చల్లారని ‘కారు’చిచ్చు

Published Wed, Nov 14 2018 1:51 PM | Last Updated on Wed, Nov 14 2018 1:51 PM

TRS Rebels In Adilabad District - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌:
టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు గడిచినా అసమ్మతి చల్లారలేదు. మంత్రి కేటీఆర్‌ పలుమార్లు నచ్చజెప్పినా, ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా మాజీ మంత్రి గడ్డం వినోద్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనే పట్టు వీడడం లేదు. బోథ్‌లో టికెట్టు ఆశించి భంగపడ్డ ఎంపీ గోడం నగేష్‌ అభ్యర్థి బాపూరావు రాథోడ్‌కు సహకరించడం లేదు. తాజాగా మంచిర్యాలలో మరో టీఆర్‌ఎస్‌ నాయకురాలు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. సిర్పూరు, ఆసిఫాబాద్‌లలో టీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ గూటికి చేరడం కొనసాగుతూనే ఉంది.

చెన్నూరులో ఇప్పటికే కొందరు నేతలు పార్టీ మారగా, పార్టీలో ఉన్న వారు కూడా తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతూనే గుబులు పుట్టిస్తున్న గులాబీ ముళ్లను చూసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 

16న బెల్లంపల్లి నుంచి వినోద్‌ నామినేషన్‌
టీఆర్‌ఎస్‌ నుంచి చెన్నూరు టికెట్టు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి గడ్డం వినోద్‌ తన సోదరుడు మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి పలుమార్లు మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. చెన్నూరు కాకపోతే బెల్లంపల్లి నుంచైనా సీటివ్వాలని కోరగా, కేటీఆర్‌ ససేమిరా అన్నారు. ఇప్పటికే ఖరారైన అభ్యర్థులను మార్చేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరి బెల్లంపల్లి నుంచి పోటీ చేయాలని వినోద్‌ భావించినప్పటికీ, ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన రాలేదు. చివరిసారిగా ఢిల్లీలో కాంగ్రెస్‌ సీటు కోసం ప్రయత్నిస్తున్న వినోద్‌ను పిలిపించి మరోసారి కేటీఆర్‌ చెన్నూరులో బాల్క సుమన్‌కు మద్ధతుగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఖాయమని చెప్పినా తనకు టికెట్టు కావాలనే పట్టుపట్టారు.

 ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీ–ఫారాలు అందజేయడంతో తనకు సీటు రాదనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మునిమంద స్వరూప, ఆమె భర్త రమేష్‌ ఈ మేరకు వినోద్‌కు మద్ధతు పలికారు. ఇటీవల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసంలో వినోద్‌ బ్రదర్స్‌ స్వరూపకు పూర్తిగా మద్ధతు పలికారు. మున్సిపాలిటీలోని మెజారిటీ కౌన్సిలర్లు కూడా వినోద్‌ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈనెల 16న ఆయన తన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. బీఎస్పీ గుర్తుపై పోటీ చేయాలని భావిస్తున్న ఆయన ఇండిపెండెంట్‌గా, బీఎస్పీ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిసింది. 

బోథ్‌లో సయోధ్యకు కేటీఆర్‌ మంత్రాంగం
బోథ్‌లో టికెట్టు ఆశించిన ఎంపీ గోడం నగేష్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావుకు సహకారం అందించడం లేదు. తమకే సీటు వస్తుందని నిన్న మొన్నటి వరకు చెప్పిన నగేష్‌ వర్గం తీరా బీ–ఫారం బాపూరావుకే ఇవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. బాపూరావుకు టికెట్టు ప్రకటించిన రెండు నెలల నుంచి ప్రచారానికి దూరంగానే ఉంటున్న నగేష్‌ గురించి బాపూరావు మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఇద్దరు నేతలను హైదరాబాద్‌ పిలిపించి సయోధ్య కుదిరించినట్లు తెలిసింది. అయితే టికెట్టు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నగేష్‌ వర్గం బాపూరావుకు ఏకోశానా సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు. నగేష్‌ ఆదివాసీ వర్గానికి చెందిన వారు కాగా బాపూరావు లంబాడా. దీంతో వీరు కలిసి పనిచేయడం కష్టమేనని స్పష్టమవుతోంది. 

మంచిర్యాలలో విజయశ్రీ తిరుగుబావుటా
మంచిర్యాలలో క్రిస్టియన్‌ సామాజిక వర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకురాలు చల్లగుల్ల విజయశ్రీ తిరుగుబావుటా ఎగరేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావుకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తనకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వలేదని భావించిన ఆమె గురువారం ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు. క్రిస్టియన్‌ సామాజిక వర్గంతో పాటు ఉద్యమకారిణిగా చేసిన పోరాటం, మహిళా నాయకురాలిగా తనకు నియోజకవర్గంలో ఉన్న గుర్తింపు కలిసివస్తాయని ఆమె భావిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన ఎంపీపీ బేర సత్యనారాయణ, ఉద్యమంలో పాల్గొన్న ఆరె శ్రీనివాస్‌ ఇప్పటికే బీఎస్పీ, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులుగా పోటీలో ఉండడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement