గొంతునొక్కి బిల్లు పాస్ చేశారు
-
చంద్రబాబు, వెంకయ్య చెప్పుచేతల్లో మోడీ నడుస్తున్నారు
-
భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం: టీఆర్‌ఎస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో మందబలంతో మా గొంతు నొక్కి పోలవరం ఆర్డినెన్సు బిల్లును ఆమోదించారని టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బలవంతంగా ఆమోదించిన ఆర్డినెన్సు బిల్లు వెనుక ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్ర ఉందని ఆరోపించారు. పార్లమెంటు వెలుపల శుక్రవారం టీఆర్‌ఎస్ లోక్‌సభ నేత జితేందర్‌రెడ్డి, ఎంపీలు సీతారాంనాయక్, బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సహా పది పార్టీల ఎంపీలు అడ్డుకున్నా.. పోలవరం ఆర్డినెన్సు చట్టం చేయడం దురదృష్టకరమన్నారు. ఆర్డినెన్సు బిల్లును రాజ్యసభలో అడ్డుకుంటామని చెప్పారు.
సంఖ్యాబలం చూసుకుని మైనార్టీ సభ్యులను ఎన్డీఏ ప్రభుత్వం అణగదొక్కిందని మండిపడ్డారు. స్పీకర్ సుమిత్రా మహజన్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. అన్యాయం జరిగితే సుప్రీంకు వెళ్లాలని స్పీకర్ చెప్పడం పార్లమెంటు విలువలను దిగజార్చడమేనన్నారు. అన్ని అంశాలను కోర్టులే తేల్చితే ఇక చట్టసభలు ఎందుకున్నట్టు అని ప్రశ్నించారు. కేంద్రంతో కలిసి పనిచేయాలని మేం అనుకుంటుండగా.. మాతో దుర్మార్గంగా వ్యవహరించిందని ఎన్డీఏ ప్రభుత్వంపై ఆగ్రహం వెలిబుచ్చారు.
ఆదివాసీలు, గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. వెంకయ్య, బాబు చెప్పుచేతల్లో ప్రధాని మోడీ నడుస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఆదివాసి, గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్రంలో బీజేపీ ఏం చేస్తోందని అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ భూభాగాన్ని, ఆదివాసి గిరిజనులను కాపాడుకోడానికి సీఎం కేసీఆర్ నాయకత్వాన కచ్చితంగా సుప్రీంను ఆశ్రయిస్తామని, అక్కడ న్యాయం జరుగుతుందని విశ్వాసం వెలిబుచ్చారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ ఎంపీ సీతారామ్‌నాయక్ సుప్రీంలో కేసు వేశారని చెప్పారు.
సభ నుంచి వాకౌట్ చేశాం: ఎంపీ కవిత
పోలవరం ఆర్డినెన్స్ బిల్లును దొడ్డిదారిన తెచ్చి ఆమోదించడాన్ని నిరసిస్తూ లోక్‌సభ నుంచి వాకౌట్ చేశామని టీఆర్‌ఎస్ ఎంపీ కె. కవిత చెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించారు. రాష్ట్ర సరిహద్దులు మార్చాలంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకకు బిల్లు పంపాలి. ఆ తర్వాత బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలి. అలా చేయకుండా దొడ్డిదారిన ఆర్డినెన్స్ బిల్లును తీసుకురావడం చాలా అన్యాయం. ఈ విషయాన్ని స్పీకర్‌కు చెబితే కోర్టు ద్వారా తేల్చుకోవాలని చెప్పారు. దీనిని మేమే కాదు.. అన్ని పార్టీలు ఖండించాయి. సభ నుంచి మేం వాకౌట్ చేశాం. తెలంగాణ, గిరిజనుల పక్షాన నిల్చుంటాం’ అని చెప్పారు.
రాజ్యసభలో అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ యోచన
సవరణ బిల్లును రాజ్యసభలో అడ్డుకోవాలని, దీనికోసం దేశవ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతును కూడగట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి యోచిస్తోంది. రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం తక్కువగా ఉన్నందున అందులో పోలవరం ఆర్డినెన్స్ ముందుకు పోకుండా చేయాల్సిన బాధ్యతను టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు అప్పగించారు. రాజ్యసభలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌ను కలుపుకోవాల్సిన బాధ్యతను ఆయనకు అప్పగించింది.