సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితా ప్రక్రియ పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న పరకాల, మహబూబాబాద్ అసెంబ్లీ, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం ప్రకటించారు.
టీఆర్‌ఎస్‌కు సవాలుగా నిలిచిన పరకాల ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతికి సీటు నిరాకరించారు. న్యాయవాద జేఏసీలో కీలకంగా పనిచేసిన ముద్దసాని సహోదర్‌రెడ్డికి పరకాల సీటు ఇచ్చారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భిక్షపతి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయంపై సాధారణ రీతిలోనే స్పందించారు. నిజయోజకవర్గంలోని నాలుగు మండలాల టీఆర్‌ఎస్ అధ్యక్షులు, సర్పంచ్‌లు, నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పరకాల టికెట్ విషయంలో పార్టీ నాయకత్వం పునరాలోచించాలని కేసీఆర్‌ను కోరారు. భిక్షపతి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటున్నా... ఇప్పటికి మాత్రం అసమ్మతి వ్యక్తం చేయడం లేదు. ఇక.. పెండింగ్‌లో ఉన్న మహబూబాబాద్ అసెంబ్లీ స్థానానికి శంకర్‌నాయక్‌ను ఖరారు చేశారు. బానోత్ శంకర్‌నాయక్ 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.
మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం టీఆర్‌ఎస్ టికెట్ ప్రొఫెసర్ ఆజ్మీరా సీతారాంనాయక్‌కు దక్కింది. కేంద్ర మంత్రి బలరాంనాయక్‌పై ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోవడం ప్రొఫెసర్‌గా ఉన్న సీతారాంనాయక్‌తోనే సాధ్యమవుతందని టీఆర్‌ఎస్ భావించింది. గతంలో పార్టీలో చేరిన రిటైర్డ్ ఐఏఎస్ రామచంద్రునాయక్ పోటీకి ఆసక్తి కనబరచలేదని తెలిసింది. మొత్తానికి టీఆర్‌ఎస్ స్థాపించిన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో మొదటిసారి అసంతృప్తులు, రాజీనామాల సెగలు లేకుండా టికెట్ల ప్రక్రియ ముగిసింది.
ఉన్నతస్థారుులో ప్రయత్నాలు
పరకాల అసెంబ్లీ టికెట్ సహోదర్‌రెడ్డికి కేటాయించడానికి ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. న్యా య విభాగంలో ఉన్నత స్థానంలో ఉన్న ఒకరు స్వయంగా కేసీఆర్‌తో మాట్లాడినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న న్యాయవాదులకు జిల్లాకు ఒక టికెట్ ఇవ్వాలని అన్ని జిల్లాల న్యాయవాద జేఏసీలు కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చాయి. టీఆర్‌ఎస్‌తోనూ సంబంధం ఉన్న వ్యక్తి కావడంతో సహోదర్‌రెడ్డికి సీటు ఇచ్చారు.
సహోదర్‌రెడ్డి టీఆర్‌ఎస్ ఆవిర్భావంలో పనిచేశారు. వరంగల్ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం దక్కకపోవడంతో సహోదర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు దూరం జరిగారు. తెలంగాణ ఉద్యమ తీవ్రమైనప్పటి నుంచి ఆయ న న్యాయవాద జేఏసీలో క్రియాశీలకంగా పని చేశారు. 2012 పరకాల ఉప ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి మొలుగూరి భిక్షపతికి సీటు దక్కింది. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షపతి స్థానంలో సహోదర్‌రెడ్డి టికెట్ దక్కించుకున్నారు.
సహోదర్‌రెడ్డి సొంత ఊరు పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం దామెర. ప్రస్తుతం ఎలాంటి అసంతృప్తిని బయటికి వ్యక్తం చేయకున్నా... ఎన్నికల్లో సహోదర్‌రెడ్డికి భిక్షపతి ఎంతవరకు సహకరిస్తారనేది ఆసక్తికరంగా ఉండనుంది. ఇదే పరకాల టికెట్‌ను ఆశించిన మరో నేత నాగుర్లు వెంకటేశ్వర్లు స్పందన టీఆర్‌ఎస్ గెలుపోటముల్లో కీలకం కానుంది.
టీఆర్‌ఎస్ జాబితా పూర్తి
Published Wed, Apr 9 2014 3:24 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
Advertisement