
మాట్లాడుతున్న జోగు రామన్న
ఆదిలాబాద్ టౌన్: రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధిని మళ్లీ గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసే నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. పట్టణంలోని భాగ్యనగర్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి రామన్న కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో రైల్వే బ్రిడ్జితో పాటు సీసీఐ పునరుద్ధరణపై బీజేపీ నాయకులు ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని ఆరోపించారు.
2016లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో రైల్వే బ్రిడ్జి మంజూరైందని బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే మూడు నెలల్లో మంజూరు చేస్తామని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.20కోట్లు కేటాయించాయని, సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మనిషా, నాయకులు సాజిదొద్దీన్, కౌన్సిలర్లు ప్రకాష్, కోఆప్షన్ సభ్యుడు ఉరుజ్‌ఖాన్, అంజద్‌ఖాన్, బాబుఖాన్, విఠల్, శ్రీనివాస్, సురేష్, జీవన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment