మనోళ్ల సత్తా
సాక్షిప్రతినిధి, వరంగల్ :రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మన జిల్లా అధికార పార్టీ నేతల వ్యూహాలు ఫలించాయి. జిల్లా నేతలు ఇన్‌చార్జులుగా వ్యవహరించిన డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు మంచి మెజారిటీతో విజయం సాధించారు. హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో, నామినేటెడ్ పోస్టుల విషయంలో ప్రభావితం చేస్తాయని టీఆర్‌ఎస్ నేతలుభావిస్తున్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకత్వం జిల్లాకు చెందిన 14 మంది కీలక నేతలకు హైదరాబాద్ ఎన్నికల బాధ్యతలనుఅప్పగించింది. హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎక్కువ మంది నేతలు తమకు కేటాయించిన డివిజన్‌లలో టీ ఆర్‌ఎస్‌ను గెలిపించుకున్నారు. అరుుతే, కాం గ్రెస్ నేతలకు మాత్రం చేదు ఫలితాలే వచ్చాయి. డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ ప్రచార బాధ్యతలు నిర్వహించిన మంగల్‌హాట్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పరమేశ్వరిసింగ్ 9,376 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మహబూబాబాద్ మాజీ ఎమ్మె ల్యే మాలోత్ కవిత ఈ డివిజన్‌లోనే ప్రచారం నిర్వహించారు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు వెంకటేశ్వరకాలనీ డివిజన్‌లో ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. అక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె కవిత 8,181 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గత ఎన్నికల వరకు కాం గ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ డివిజన్‌లోనే టీ ఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సొంత ఇళ్లు ఉంది.
గ్రేటర్ వరంగల్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్ ప్రచార బాధ్యతలు నిర్వహిం చిన మల్లాపూర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవేందర్‌రెడ్డి 7,989 ఓట్ల మెజారిటీతో గెలి చారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉప్పల్ నియోజకవర్గం మొత్తాన్ని సమన్వ యం చేయడంతోపాటు ఈ డివిజన్‌లో ప్రచా రం నిర్వహించారు రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌లు ఏఎస్.రావు నగర్ డివిజన్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి పజ్జూరి పావని 7,987 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే డి.వినయభాస్కర్ చిలుకానగర్ డివిజన్‌లో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. వినయ్‌భాస్కర్‌ది నగర నియోజకవర్గం(గ్రేటర్ వరంగల్) కావడంతో అక్కడ పక్కా ఎన్నికల వ్యూహం అమలు చేశా రు. ఈ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సరస్వతి 7,982 ఓట్లతో విజయం సాధించారు.
జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ నర్సింగరావు చర్లపల్లి డివిజన్‌లో ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి బొంతు రామ్మోహన్ 7,869 ఓట్ల ఆధిక్యంతో గెలి చారు. టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి కూడా ఈ డివిజన్‌లోనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బాధ్యతలు నిర్వహించిన హబ్సీగూడ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి స్వప్నారెడ్డి గెలిచారు. ఆమెకు 7,468 ఓట్ల మెజారిటీ లభించింది. మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ మాదాపూర్ డివిజన్లలో ప్రచారం బాధ్యతలు చేపట్టారు. ఈ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి జగదీశ్వర్ 6,005 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మీర్‌పేట డివిజన్‌లో ప్రచారం బాధ్యతలు నిర్వర్తించా రు. టీఆర్‌ఎస్ అభ్యర్థి అంజయ్య 5707 ఓట్ల ఆధిక్యంతో ఈ డివిజన్‌లో గెలిచారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ప్రచార బాధ్యతలు నిర్వహించిన జగద్గిరిగుట్టలో టీ ఆర్‌ఎస్ అభ్యర్థి జగన్ 5,559 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రచార బాధ్యతలు నిర్వహించిన రామాంతపూర్ డివి జన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి జోత్స్న 5,157 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జనగామ ఎమ్మెల్యే ఎం.యాదగిరిరెడ్డి కాప్రా డివిజన్‌లో ప్రచార విధులు నిర్వహించారు. ఈ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రావణ్‌రాజ్ 5029 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముషీరాబాద్ డివిజన్‌లో ప్రచార బాధ్యతలు చేపట్టా రు. టీఆర్‌ఎస్ అభ్యర్థి భాగ్యలక్ష్మి 4,124 ఓట్ మెజారిటీతో గెలిచారు. ఇక్కడి టీఆర్‌ఎస్ అ భ్యర్థిపై మొదట వ్యతిరేతక వ్యక్తమైంది. అరూ రి రమేశ్ స్థానిక నేతలను సమన్వయం చేసి భాగ్యలక్ష్మి గెలుపులో కీలకపాత్ర పోషించారు మహబూబాబాద్ ఎమ్మెల్యే బి.శంకర్‌నాయక్ ప్రచార బాధ్యతలు తీసుకున్న బోలక్‌పూర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ పరాజయం పాలైంది. ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి అహ్మద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిపై 2,029 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య ప్రచా ర బాధ్యతలు నిర్వహించిన నాచారం డివి జన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శాంతి 152 ఓట్ల ఆధికత్యంతో గెలిచారు. ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రచారం చేసిన జాంబాగ్ డివిజన్‌లోనూ టీఆర్‌ఎస్ పరాజయం పాలైంది. ఈ డివిజన్‌లో ఎంఐ ఎం అభ్యర్థి మోహన్ ఐదు ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు.