పోచంపాడు సభపై టీఆర్‌ఎస్ కసరత్తు
► 5 జిల్లాల నుంచి రైతుల తరలింపు
► సమీకరణపై మంత్రులు, నేతలతో నేరుగా సీఎం సంభాషణ
► సభ బాధ్యతలు మంత్రి ఈటలకు
సాక్షి, హైదరాబాద్: పోచంపాడు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా పేరున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఆధునీకరణకు రూ.2 వేల కోట్లతో ప్రభుత్వం పునరుజ్జీవ పథకం చేపడుతున్న నేపథ్యంలో ఈ సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 10న సీఎం కేసీఆర్ ఈ పథకానికి ఎస్సారెస్పీ ప్రాజెక్టు వద్ద ఉన్న పోచంపాడులో శంకుస్థాపన చేయనున్నారు. పోచంపాడు వద్దే భారీ బహిరంగ సభను నిర్వహిం చనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని టీఆర్‌ఎస్ ఆగ్రహంతో ఉంది. దీంతో విపక్షాలకు దీటైన జవాబిచ్చేందుకు పోచంపాడు సభను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది.
ప్రతిష్టాత్మకంగా జన సమీకరణ
ఎస్సారెస్పీ ద్వారా లబ్ధి పొందుతున్న నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లా (పూర్వపు)ల రైతాంగాన్ని పోచంపాడు బహిరంగ సభకు సమీకరించాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లాలకు పూర్తి స్థాయిలో నీరు అందడంలేదు. దీంతో ఈ జిల్లాల రైతులకు సాగునీరు అందేలా, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకువచ్చి ఎస్సారెస్పీ జలాశయంలో పోయడం ద్వారా ఆయకట్టు చివ రి భూములకూ నీటిని అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని చేపడుతున్నారని, ఈ విషయాలన్నీ రైతులకు సభ ద్వారా వివరిస్తారని నేతలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో జన సమీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో ఇప్పటికే సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా పూర్వపు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి ఎక్కువ మంది రైతులను సమీకరించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు ఎన్ని అవసరం అవుతాయి, ఇతర వాహనాల పరిస్థితి ఏమిటన్న అంశంపైనా సమీక్షించారని సమాచారం
సభ బాధ్యతలు మంత్రి ఈటలకు: ఎస్సారెస్పీ పునరుజ్జీవ సభ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను ఆర్థిక మంత్రి ఈటల రాజెందర్‌కు సీఎం కేసీఆర్ అప్పగించారు. ఎస్సారెస్పీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులను సమన్వయం చేసి సభను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి, ఈటలకు సూచించారని సమాచారం.