నోటికొచ్చినట్లు ఆరోపిస్తే దావా వేస్తాం | TRS Working President KTR Warns for Opposition | Sakshi
Sakshi News home page

నోటికొచ్చినట్లు ఆరోపిస్తే దావా వేస్తాం

Published Thu, May 2 2019 1:41 AM | Last Updated on Thu, May 2 2019 1:41 AM

TRS Working President KTR Warns for Opposition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల వ్యవహారంలో ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు హెచ్చరించారు. రూ. 4.30 కోట్ల టెండర్లలో రూ. 10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని దిగజారి మాట్లాడుతున్నా రని మండిపడ్డారు. ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయతీని నిరూపించుకొమ్మంటే ఎలా? అని ఆవే దన వ్యక్తం చేశారు. పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు ఒక బఫూన్‌ రమ్మంటే వెళ్లాలా అని ప్రశ్నించారు.

అధికార పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను కాబట్టి బట్ట కాల్చి మీద వెయ్యాలని కొందరు ఏది పడితే అలా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంటర్‌ ఫలితాల విషయంలో ప్రతిపక్షాలు, మీడియా సంయమనం పాటించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో బుధవారం ఘనంగా మే డే వేడుకలు జరిగాయి. టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం జెండా ఆవిష్కరించిన అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. 

ప్రతిపక్షాలకు వేరే అంశాలు లేకే... 
‘అన్నీ మంచిగా జరుగుతుంటే కొందరికి మనసున పడడంలేదు. ప్రతిపక్షాలకు ఏ అంశం లేకనే ఇంటర్‌ ఫలితాల సమస్యను రావణ కాష్టంలా రగిలిస్తున్నాయి. తప్పులు జరిగితే ప్రభుత్వం కచ్చితంగా సరిదిద్దుకుంటుంది. ఒక తండ్రిగా నాకూ బాధ ఉంది. పిల్లలు చనిపోతే ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే ఎవరూ తొందరపడవద్దని సీఎం కేసీఆర్‌ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలకు వేరే అంశాలు లేక చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ఒకాయన మాట్లాడారు. అది విద్యాశాఖలోని బోర్డులో జరిగిన విషయం. దీనికి ఐటీ శాఖతో సంబంధం ఉండదు. అందులో ఏం జరిగిందో తెలియదు. విచారణలో తేలుతుంది. నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు గ్లోబరీనా సంస్థకు టెండర్‌ దక్కితే తప్పును నాకు అంటగడుతున్నారు. రూ. 4.30 కోట్ల టెండర్‌లో రూ. 10 వేల కోట్ల లం చం ఇచ్చారని అంటున్నారు.

సమస్య సున్నితమైనది. ఈ విషయంలో అందరూ సంయమనం పాటించాలి. రాజకీయంగా కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ ఎదుర్కోవాలం టే ప్రతిపక్షాలకు వేరే అంశాలు ఉన్నాయి. విద్యార్థు లు, తల్లిదండ్రులు తొందర పడవద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక బఫూన్‌.. పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు రమ్మంటే వెళ్లాలా? ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయతీని నిరూపించుకొమ్మంటే ఎలా? కేసీఆర్‌ను ఎవరైనా ఏదైనా అం టే కొన్ని మీడియా సంస్థలు లేనిపోని హడావుడి చేస్తున్నాయి. ఇంటర్‌ ఫలితాల కేసు విచారణ హైకోర్టులో జరుగుతోంది. చదువే మొత్తం కాదు. తొందరపడి ప్రాణాలు తీసుకుంటే మళ్లీ రావు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులను బాధ పెట్టొ ద్దు. సమస్య తీవ్రమైనదే.

అయినా ప్రతిపక్షాలు, మీడి యా సంయమనం పాటించాలని కోరుతున్నా. కాంగ్రెస్‌ పార్టీకి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. మర్యాదగా తప్పు దిద్దుకుంటే మంచిది. లేకుంటే కోర్టు దావాలకు వెళ్లాల్సి వస్తుంది. రాహుల్‌ గాంధీ ఏదో మాట్లాడితే కోర్టుకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కోర్టు దోషులుగా తేల్చిన వాళ్లను శిక్షించాలని ప్రభుత్వాన్ని నేనే మొదట డిమాండ్‌ చేస్తా. ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తాం. మీడియా ఇంటర్‌ సమ స్య విషయంలో సంయమనం పాటించాలి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సంయమనం పాటించాలని ప్రతిపక్షాలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుంది. అప్పటిదాకా అందరూ ఓపిక పట్టాలి’అని కేటీఆర్‌ సూచించారు. 

కేసీఆర్‌.. కార్మిక పక్షపాతి 
కార్మిక లోకానికి కేటీఆర్‌ మే డే శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమలు రావడమే కాదు... స్థానికులకు ఉపాధి కలగాలని, కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనాలు అందాలనేది కేసీఆర్‌ విధానమని చెప్పారు. సీఎం కేసీఆర్‌ కార్మిక పక్షపాతి అని చేతల్లో నిరూపించుకున్నారన్నారు. అంగన్‌వాడీ కార్మికులకు రెండుసార్లు వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్‌ది అని, కొన్ని ఎర్రజెండా పార్టీలు ఉద్యమాలకు వారిని వాడుకున్నారు తప్పితే ఏమీ చేయలేదని కేటీఆర్‌ వ్యాఖ్యా నించారు. గతంలో అంగన్‌వాడీ కార్మికులు వేతనాలు పెంచాలని కోరితే గుర్రాలతో తొక్కిస్తే కేసీఆర్‌ వారికి రెండుసార్లు వేతనాలు పెంచారని ఆయన గుర్తుచేశారు. ‘సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లోకి ఎవరినీ రానివ్వరని ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలుతుంటాయి.

కానీ కేసీఆర్‌ కార్మికులను ప్రగతి భవన్‌కు పిలిపించి వారికి భోజనాలు పెట్టి మూడు గంటలపాటు చర్చించారు. కార్మికుల వేతనాలు పెంచారు. సింగరేణి కార్మికులకు అత్యధిక బోనస్‌ ఇవ్వడంతోపాటు వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించారు. హోంగార్డులకు, జీహెచ్‌ఎంసీ స్వీపర్లకు, ఆశావర్కర్లకు, వీఆర్‌ఏలకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, విద్యుత్‌ కార్మికులకు, ఆర్టీసీ కార్మికులకు వేతనాలను పెంచిన కార్మిక పక్షపాతి కేసీఆర్‌. మూతబడిన పరిశ్రమలను తెరిపించారు. కొత్త పారిశ్రామిక విధానాన్ని తెచ్చారు. పనిచేసే చోటే కార్మికులకు నివాస సదుపాయం కల్పించాలనేది సీఎం ఆలోచన. పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువగా ఉద్యోగాలు కల్పించాలనేది కేసీఆర్‌ విధానం.

అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర కార్మిక మంత్రిగా కేసీఆర్‌ ఎన్నో చేశారు. బీడీ కార్మికులకు భృతి ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. గీత కార్మికులకు, చేనేత కార్మికులకు చేయూత ఇస్తున్నారు. ఆటోలకు రవాణా పన్ను మినహాయించి వారికి లబ్ధి చేకూర్చారు. కార్మికులకు సంబంధించి ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ అన్నింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వ్యవసాయ ప్రగతి పెరగాలి. ఈ రంగాలతో సంపద పెరగాలి. పెరిగిన సంపదను అందరి సంక్షేమం కోసం పంచాలి. ఇదే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానం.

కార్మికులందరికీ రేషన్‌ కార్డులు ఇచ్చే విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తా. సాక్షర భారత్, గోపాలమిత్ర, మధ్యాహ్న భోజనం వర్కర్లకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్మిక పక్షపాతి కాదు. టీఆర్‌ఎస్‌ నిర్ణయాత్మక శక్తిగా ఉంటే కార్మికులకు అన్ని రకాలుగా మేలు చేసేందుకు మరింతగా ప్రయత్నిస్తాం’ అని కేటీఆర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కాలేరు వెంకటేష్, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం నేతలు రాంబాబు యాదవ్, రూప్‌సింగ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ శాఖలకు అభినందనలు... 
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల విద్యార్థులు ప్రతిభ కనబరిచేలా కృషి చేసిన సంక్షేమ శాఖలకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. సంక్షేమ శాఖల అధికారుల బృందం చక్కగా పని చేసిందని ప్రశంసించారు. సాంఘిక, గిరిజన సంక్షేమ సంస్థల్లో చదవిన 506 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌లో ప్రతిభ కనబరిచారని సంక్షేమశాఖ ట్విట్టర్‌లో పేర్కొన్న అంశంపై కేటీఆర్‌ స్పందించారు. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.

జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి మృతికి సంతాపం
జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి మృతిపట్ల టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ట్విట్టర్‌ వేదికగా సుభాషణ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement