తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తేదీలను విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జులై 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, కాలెజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిఠ్ఠల్, వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఫ్రొఫెసర్ వి.వెంకటరమణలతో రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి శనివారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనలకు లోబడి, యూజీసీ ఇచ్చిన సలహాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో కోవిడ్-19 నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యుల్‌ను విడుదల చేశారు.
కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలో విద్యావ్యవస్థపై పడటంతో అన్ని పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు తేదీలు ఖరారు కావడంతో.. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలపై శనివారం విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. జులై 6 నుంచి 9 వరకు తెలంగాణ ఎంసెట్, జులై 4న తెలంగాణ ఈసెట్, జులై 10న లాసెట్, జులై 1 నుంచి 3 వరకు టీఎస్ పీజీఈసెట్, జులై 1న టీఎస్ పాలిసెట్, 13న ఐసెట్, 15న ఎడ్‌సెట్ నిర్వహించనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment