సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉద్యానవన విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిన 1200ల బహుళ ప్రయోజన వ్యవసాయ విస్తరణాధికారుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విస్తరణాధికారులు లేక ఉద్యాన విభాగం పని తీరు కుంటుపడిన నేపథ్యంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ ఉద్యోగాలకు వ్యవసాయ బీఎస్సీ, లేదా వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సు చదివిన వారే అర్హులని ప్రకటించగా, ఈసారి బీఎస్సీ(జంతుశాస్త్రం) చదివిన వారికీ కూడా అవకాశం కల్పిస్తూ ఉద్యోగాలను నాలుగు తరగతులుగా వర్గీకరించింది.
తొలి విభాగం పోస్టులకు అభ్యర్ధులు యూజీసీ గుర్తింపు ఉన్న ఏదైనా యూనివర్శిటీ నుంచి నాలుగేళ్ల బీఎస్సీ (ఉద్యాన విభాగం) లేదా బీఎస్సీ (అగ్రీ) పూర్తి చేసి ఉండాలి. రెండో విభాగం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయం నుంచి హార్టీకల్చర్‌లో పాలిటెక్నిక్ డిప్లొమా తీసుకున్న వారు, మూడో విభాగం ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైనా గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ లేదా ఎంఎస్సీ (హార్టీకల్చర్‌లోని ఏదో ఒక అంశంతో) చదివిన వారు, నాలుగో విభాగం ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తింపు ఉన్న ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ (బీజెడ్సీ) డిగ్రీ చదివిన వారు అర్హులని ప్రకటించింది.
1200 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Published Thu, Apr 28 2016 9:35 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement