
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి సంబంధించిన సాంకేతిక (ఆన్‌లైన్) పనుల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకకుండా పకడ్బందీ చర్య లు చేపడుతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ఇటీవల బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం బోర్డు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో పొరపాట్లు ఎక్కడ దొర్లాయో పరిశీలిస్తున్నామని, త్రీమెన్ కమిటీ నివేదికను అధ్యయనం చేస్తున్నామన్నారు. వాట న్నింటిని పరిగణనలోకి తీసుకొని అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగానే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం బోర్డులోని ఐటీ నిఫుణులతో పాటు ప్రభుత్వ ఐటీ విభాగానికి చెందిన ఐటీ నిఫుణులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
డిసెంబర్ వరకే ఫీజుల చెల్లింపు..
ఫిబ్రవరి వరకు పరీక్ష ఫీజులు చెల్లించే విధానం వల్ల కూడా కొన్ని పొరపాట్లు దొర్లుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈసారి డిసెంబర్ వరకే పరీక్ష ఫీజుల చెల్లింపు విధానాన్ని అమలు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. బోర్డుకు సంబంధించిన అంశాలు, క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలపై సమీక్షించేందుకు, తగిన కార్యాచరణను రూపొందించి అమలు చేసేందుకు ఈనెల 27న జిల్లా ఇంటర్ విద్యాధికారులతో (డీఐఈవో) సమావేశం నిర్వహించనున్న ట్లు తెలిపారు. జిల్లాల వారీగా గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలను జిల్లాల్లోని డీఐఈవో కార్యాలయంలో ప్రదర్శిస్తామన్నారు.
కమిటీ సిఫారసులు అమలు..
గత వార్షిక పరీక్షల్లో పరీక్షల మూల్యాంకనం, ఆ తర్వాత కంప్యూటరీకరణ, ఆన్‌లైన్ ప్రాసెస్ వంటి వాటిపై త్రీమెన్ కమిటీ ఇచ్చిన సిఫారసులను అమలు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు.
సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు
ఇక జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి వచ్చే నెల 9 వరకు దసరా సెలవులుగా ప్రకటిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ చెప్పారు. కాలేజీలు తిరిగి వచ్చే నెల 10న ప్రారం భం అవుతాయని స్పష్టం చేశారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సంబంధిత కాలేజీలు, ప్రిన్సిపాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment