పీజీఈసెట్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి
హైదరాబాద్ : తెలంగాణలో ఎంఈ, ఎంటెక్, ఎం.ఆర్క్, ఎం.ఫార్మసీలో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీజీఈ సెట్) ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఫలితాలను వెల్లడించారు. (ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి)
ఈనెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఓయూ నిర్వహించిన 18 సబ్జెక్టుల పరీక్షకు 43,776 మంది విద్యార్థులు హాజరుకాగా 88.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పాపిరెడ్డి తెలిపారు. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు తక్కువ సంఖ్యలో పరీక్షకు హాజరైనా... వారిదే పైచేయి కావడం విశేషం. 25,880 మంది అబ్బాయిలకుగాను.. 22,768 (87.98 %), 17,896 మంది అమ్మాయిల్లో 16,114 (90.04%) మంది ఉత్తీర్ణులయ్యారు. ర్యాంకు కార్డులను ఈనెల 20వ తేదీన యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.