
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే టీఎస్‌సెట్–2018లో 29 సబ్జెక్టులకు గాను రేపటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ యాదగిరిస్వామి సోమవారం తెలిపారు. అధ్యాపక ఉద్యోగాల అర్హతకు, పీహెచ్‌డీలో నేరుగా ప్రవేశాలకు పీజీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు టీఎస్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు సమయంలో కుల ధృవీకరణ పత్రాన్ని స్కాన్‌చేసి పంపించాలన్నారు. రేపటి నుంచి www.telanganaset.org/ www.osmania. ac.in వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. రేపటి నుంచి ఏప్రిల్ నెల 14 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ట్రాన్స్‌జెండర్లు రూ.500, బీసీలు రూ.800, ఓసీలు రూ.1,000 ఫీజు చెల్లించాలన్నారు. రూ.1,500 అపరాధ రుసుముతో వచ్చే నెల 24 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో మే నెల 4 వరకు, రూ.3,000 అపరాధ రుసుముతో మే నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూలై 15న టీఎస్‌సెట్–2018ను హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు.
రాష్ట్ర రిజర్వేషన్లు వర్తింపు..
టీఎస్‌సెట్‌లో ఈ సారీ రెండు పేపర్లు మాత్రమే ఉంటాయని అన్నారు. జూలై 15న ఉదయం 10 గంటల నుంచి 12 వరకు వంద మార్కుల జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్, 12.15 నిమిషాల నుంచి 1.15 నిమిషాల వరకు 200 మార్కులకు సంబం ధిత సబ్జెక్టుల పరీక్షలు ఉంటాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ట్రాన్స్‌జెండర్లకు 35 శాతం, ఓసీలకు 40 శాతం మార్కులుగా రావాల్సిందిగా ప్రకటించారు. గతంలో మాదిరి కాకుండా బీసీలకు రాష్ట్ర రిజర్వేషన్ విధానాన్ని వర్తింపజేయనున్నట్లు చెప్పారు. బీసీల్లో ఏ, బీ, సీ, డీ, ఈ గ్రూపులుగా వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు యాదగిరిస్వామి వివరించారు.