టీఎస్-సెట్ 2017(తెలంగాణ స్టేట్- స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైంది.
జూన్ 11న పరీక్ష.. ఈనెల 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల భర్తీ కోసం నిర్వహించే టీఎస్–సెట్ 2017 (తెలంగాణ స్టేట్– స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎస్.రామచంద్రం గురువారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 11న నిర్వహించే టీఎస్–సెట్ పరీక్షకు సంబంధించి ఈనెల 22 నుంచి మార్చి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
జనరల్ అభ్యర్థులు రూ.1,000, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. నిర్దేశిత గడువు తర్వాత లేట్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునే అవకాశముంది. రూ.1,500 ఆలస్య రుసుముతో మార్చి 30 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 6 వరకు, రూ.3 వేల ఆలస్య రుసుముతో మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము కేటగిరీలో రిజిస్ట్రేషన్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే 20 నుంచి ఆన్‌లైన్‌లో హాల్ టిక్కెట్లు పొందవచ్చు. కాగా డిగ్రీ లెక్చరర్లు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియామకం కావాలన్నా, పదోన్నతి పొందాలన్నా టీఎస్–సెట్‌లో తప్పని సరిగా ఉత్తీర్ణులై ఉండాలి.