సాక్షి, హైదరాబాద్ : గ్రూప్–2 ఉద్యోగాల భర్తీపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. రాతపరీక్ష రాసి ఏడాది గడిచినా నియామకాల ప్రక్రియ పూర్తి చేయకపోవడంపై ఆం దోళన వ్యక్తమవుతోంది. గ్రూప్–2 పరీక్షకు సంబంధించి కోర్టు పరిధిలో కేసు ఉండడంతో ఫలితాలు వెల్లడించడం లేదని టీఎస్‌పీఎస్సీ చెబుతుండగా.. పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అభ్యర్థుల నుంచి ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి.
గ్రూప్–2 కేటగిరీలో 439 ఉద్యోగాల భర్తీ కోసం 2015 డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నాయని క్షేత్రస్థాయి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మరో 593 పోస్టులను కలిపి మొత్తంగా 1,032 పోస్టులతో సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 7.89 లక్షల మంది పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నవంబర్ 11, 13 తేదీల్లో టీఎస్‌పీఎస్సీ రాత పరీక్ష నిర్వహించగా 5.17 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు ప్రకటించినా ఇప్పటికీ ఇంటర్వ్యూ తేదీలను మాత్రం ప్రకటించలేదు.
కేసులతో చిక్కులు..
గ్రూప్–2 పరీక్షలో కొందరు జవాబు పత్రాల్లో వైట్‌నర్ వినియోగించారంటూ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. వైట్‌నర్ వినియోగం, డబుల్ బబ్లింగ్‌తో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దీంతో నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. రాత పరీక్షతోపాటు ఫలితాల వెల్లడిలోనూ అవకతవకలు జరిగాయంటూ ఇంకొందరు కోర్టుకెక్కారు. భర్తీ ప్రక్రియలో 1:2 నిష్పత్తిలో జాబితా ప్రకటించాల్సి ఉండగా.. 1:3 నిష్పత్తిలో ఇచ్చారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. కేసు పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment