సుందరయ్య విజ్ఞానకేంద్రం(హైదరాబాద్) : ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని, ఇకకైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. గురువారమిక్కడి ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు చేసిన సూచనలను తిరస్కరించడం ద్వారా ప్రభుత్వం కోర్టులను తప్పు దోవ పట్టించిందని ఆరోపించారు. విలీనం చేస్తేనే చర్చలకు వస్తామంటున్నామని, విలీన డిమాండ్‌పై పట్టు వీడడం లేదంటూ తమపై దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను వదులుకుంటున్నామని, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం కార్మిక సం ఘాలతో చర్చలు జరపాలని కోరారు. 23 మంది కార్మికుల ఆత్మహత్యలు, మరణాలకు ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నా.. ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యే గానీ, ఒక మంత్రి గానీ పరామర్శించడం, సానుభూతి ప్రకటించకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మాకు మద్దతివ్వండి...
ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తే ఆర్టీసీ కార్మికుల కన్నా ప్రజలే ఎక్కువ నష్టపోతారని, తమ ఇష్టానుసారం చార్జీలు పెంచుకుంటూ వెళతారని అశ్వత్థామరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు ప్రజా, ఉద్యోగ, నిరుద్యోగ తదితర సంఘాలు సంపూర్ణ మద్ధతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు మనోధైర్యం కోల్పోయి ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ట్యాంక్‌బండ్ బంద్‌ను విజయవంతం చేసిన కార్మికులకు, తమకు మద్ధతు ప్రకటించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమ్మెలో భాగంగా శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు తాము నిర్వహించతలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని అశ్వత్థామరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ నేత వీహెచ్, బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, మోహన్‌రెడ్డి, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్, న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్, సూర్యం, డీజీ నర్సింగ్‌రావు, ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి, థామస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జేఏసీ ఆందోళన కార్యక్రమాలివే..
- 15న గ్రామాల్లో బైక్ ర్యాలీలు
- 16న సామూహిక నిరాహార దీక్షలు, వీటికి మద్దతుగా డిపోల ముందు బైక్ ర్యాలీలు
- 17, 18న అన్ని బస్ డిపోల ముందు సామూహిక దీక్షలు
- 19న హైదరాబాద్–కోదాడ జాతీయ రహదారిపై సడక్‌బంద్
Comments
Please login to add a commentAdd a comment