
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాలు, విద్యార్థి సంఘాలు, తెలంగాణ జన సమితి ఆందోళనకు దిగడంతో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ధర్నా చౌక్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వామపక్ష నేతలతో పాటు తెలంగాణ జన సమితి నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
జీడిమెట్లలో వినూత్న నిరసన
విధుల్లో చేరడానికి అంగీకరిస్తూ యాజమాన్యానికి లేఖలు ఇచ్చిన డ్రైవర్ మల్లిఖార్జున్, కండక్టర్ మల్లికపై సమ్మెలో ఉన్న కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా ఆకలి కేకలతో సమ్మె చేస్తుంటే నమ్మక ద్రోహానికి పాల్పడతారా అంటూ మండిపడ్డారు. వీరిద్దరి ఫొటోలతో ఫ్లెక్సీలు తయారు చేయించి చెప్పుల దండ వేసి జీడిమెట్ల బస్ డిపో ముందు నిరసన తెలిపారు. చెప్పులతో కొట్టి ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని ఈ ఫ్లెక్సీని తొలగించారు. అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన సమయంలో కొంత మంది నమ్మకద్రోహం చేశారని కార్మికులు వాపోయారు.
గుత్తాకు వినతిపత్రం
కోదాడలో శానన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాన్వాయ్‌ని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సంస్థను, కుటుంబాలను కాపాడుకోవడానికి కార్మికులు సంయమనం పాటించాలని కోరారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, త్వరలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
మంత్రి ఇల్లు ముట్టడికి యత్నం
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఇంటి ముట్టడికి అఖిల పక్ష నాయకులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆర్టీసీ మహిళా కార్మికురాలు సొమ్మసిల్లి పడిపోయింది. అరెస్ట్ చేసిన ఆందోళనకారులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిజామాబాద్‌లో మానవహారం
34వ రోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద మానవ హారం చేపట్టారు. అంతకుముందు ధర్నా చౌక్ నుంచి కవిత కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ మీదుగా తిరిగి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీచేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment