సాక్షి, హైదరాబాద్ : సమ్మెపై తెలంగాణ కార్మిక సంఘాలు పట్టు వీడటం లేదు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు శనివారం ఎంజీబీఎస్‌లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేసీఏ నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు. తమతో ప్రభుత్వం చర్చలు జరిపితేనే సమ్మెపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎస్మాకు భయపడేది లేదని, ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తామని అన్నారు. ప్రభుత్వం బెదిరింపులకు కార్మికులు భయపడవద్దని అశ్వత్థామరెడ్డి కోరారు.
ఆర్టీసీ ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ.. సకల జనుల సమ్మె కన్నా ఎక్కువగా తాము పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ప్రయివేట్ సిబ్బందితో బస్సులు నడిపించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని మండిపడ్డారు. బంగారు తెలంగాణ ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే పరిమితం అయిందని విమర్శించారు. బతుకు తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ప్రజలు సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలో ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, థామస్ రెడ్డి, తిరుపతి, వీఎస్‌రావు, ఇతర నేతలు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేపట్టారు.
డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు
రాజేంద్రనగర్ బస్ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment