
కేసీఆర్ బంధువుకు కాంట్రాక్ట్ దక్కలేదనే ...
కరీంనగర్: ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ లైన్ కాంట్రాక్ట్ తమ బంధువుకు దక్కలేదనే సీఎం కేసీఆర్ నక్సల్ సమస్యను తెరపైకి తీసుకువచ్చారని టీటీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బస్సు యాత్రలో భాగంగా ఆదివారం కరీంనగర్ వచ్చిన టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, రేవంత్ రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... ఆ కారణంగానే ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ లైన్ వేసే పనిని ఆపేశారని అన్నారు. అలాగే సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్లో కరెంట్ లైన్ వేసే పనులు ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పగిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపిన అధికారిని టీఆర్ఎస్ బదిలీ చేసిందని విమర్శించారు.
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలన్నీ టీఆర్ఎస్ సర్కార్ చేసినవేనని అన్నారు. ప్రజల సమస్యల గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే బస్సు యాత్ర చేపట్టాం కానీ రాజకీయం చేయడానికి కాదని వారు అన్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెస్తామన్ని హెచ్చరించారు.