
'యాగాలతో బంగారు తెలంగాణ రాదు'
ముఖ్యమంత్రి కేసీఆర్ చేయనున్న చండీయాగం, ఆయన కూతురు ఎంపీ కవిత ఆడుతున్న బతుకమ్మలతో బంగారు తెలంగాణ రాదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు.
రాయికల్(కరీంనగర్): ముఖ్యమంత్రి కేసీఆర్ చేయనున్న చండీయాగం, ఆయన కూతురు ఎంపీ కవిత ఆడుతున్న బతుకమ్మలతో బంగారు తెలంగాణ రాదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. కరీంనగర్ జిల్లా రాయికల్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం కేంద్రానికి నివేదిక ఇవ్వలేదని, అదే చండీయాగం కోసం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి ఆహ్వానించడం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్రం నుంచి ఎలాంటి నివేదిక రాలేదని, దీంతో కరువు నిధులను మంజూరు చేయలేకపోతున్నామని కేంద్రం తెలిపినట్లు రమణ గుర్తుచేశారు. కరువు కాటకాలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే కేసీఆర్ తన కూతురు కవిత ఆడే బతుకమ్మ పండగల కోసం కోట్లాది రూపాయలను విడుదల చేయడం వారి కుటుంబ పాలనకు నిదర్శనమన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందుతాడని ధీమా వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై రైతు చెప్పు విసరడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.