పై చదువులకు.. ప్రజాప్రతినిధి
నల్లగొండ అర్బన్ : దాదాపు 20 ఏళ్ల క్రితం మానేసిన చదువును కొనసాగించేందుకు ఓ ప్రజాప్రతినిధి తిరిగి పుస్తకాలు చేతపట్టి పరీక్షకు హాజరయ్యారు. ఆలేరు సర్పంచ్ కందగట్ల నిర్మల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఆదివారం నిర్వహించిన డిగ్రీ అర్హత పరీక్షకు స్థానిక ఎన్జీ కాలేజీ సెంట ర్‌లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆమెతో ముచ్చటించగా చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ‘1985లో ఎస్సెస్సీ ప్రథమ శ్రేణిలో పాసయ్యా. ఆ తర్వాత పెళ్లవడం, ఉమ్మడి కుటుంబం కావడంతో చదువు పూర్తి చేయలేకపోయాను. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆలేరు సర్పంచ్‌గా నెగ్గా. అయినా చదువుపై మమకారం తగ్గకపోవడంతో ఓపెన్ డిగ్రీ ద్వారా తిరిగి చదవాలనుకున్నా. చదువుకుంటే ప్రజాసమస్యలను లోతుగా అధ్యయనం చేయవచ్చు. ఇంతటితో ఆపేయను. ఆ తర్వాత కూడా ఉన్నత విద్య కొనసాగించాలనుకుంటున్నా.’ అని వివరించారు.