సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల్లో చదివే విద్యార్థులకు టీవీ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఆన్‌లైన్ విద్యా బోధనపై కేంద్రం ఆదేశాలు జారీ చేసినా అది ప్రైవేటు పాఠశాలలకు పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అన్‌లైన్ కనెక్టివిటీ లేదు. కంప్యూటర్లు లేవు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని టీశాట్, దూరదర్శన్ (యాదగిరి) వంటి టీవీచానళ్ల ద్వారా రికార్డు చేసిన వీడియో పాఠాలను ప్రసారం చేసేందుకు కసరత్తు చేస్తోంది.
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించే పనిలో పడింది. గతంలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి రూపొందించిన వీడియో పాఠాలు, రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ (ఎస్‌ఐఈటీ) రూపొందించిన తరగతుల వారీగా వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని సద్వినియోగ పరచుకునేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వాటితోపాటు అవసరమైన పాఠాలను రికార్డు చేసి ప్రసా రం చేస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తోంది.
విద్యార్థుల మధ్య అంతరాలు పెరగకుండా..
రాష్ట్రంలోని 40,597 పాఠశాలల్లో 58 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. అందులో 31 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో ఉంటే 27 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లోని కార్పొరేట్, కొంత పేరున్న స్కూళ్లు ఆన్‌లైన్ తరగతులను జూన్ నెలలోనే ప్రారంభిం చాయి.
ఇక సాధారణ ప్రైవేటు స్కూళ్లు కూడా ఆన్‌లైన్ బోధనను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రైవేటులో ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతుంటే ప్రభుత్వ స్కూళ్లలో ఏమీ లేకపోతే విద్యార్థుల మధ్య అంతరాలు పెరిగిపోతాయన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో టీవీల ద్వారా పాఠాలను బోధించాలని భావిస్తున్నారు. ఇప్పటికే రూపొందించిన పాఠాలతోపాటు అవసరమైతే మరిన్ని పాఠాలను రూపొందించి ప్రసారం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఆరో తరగతి నుంచే వీడియో పాఠాలు
ఈ వీడియో పాఠాలు ఆరో తరగతి నుంచే ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకే వీడి యో పాఠాలను ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ ఒక్కో తరగతికి రెండు గంటల చొప్పున 3 తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కోక్లాస్ అరగంట ఉండే లా, ప్రతి తరగతికి మధ్య 10 నుంచి 15 నిమిషాలు బ్రేక్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు 3, 4, 5 తరగతుల విద్యార్థులకు వర్క్‌షీట్ల ద్వారా సబ్జెక్టుపై అవగాహన కల్పించే లా కసరత్తు చేస్తున్నారు. అయితే వాటిని విద్యార్థులకు ఎలా చేరవేయడమన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. ఎంఈవోల ద్వారా ప్రధానోపాధ్యాయులకు మెయిల్ ద్వారా పంపిం చి, వాటిని విద్యార్థులకు పంపిణీ చేయా లని భావిస్తున్నారు. వాటిని తీసుకునేందుకు విద్యార్థులు లేదా తల్లిదండ్రులు వస్తారా? అది ఎంతమేరకు సాధ్యమవుతుందన్న దానిపై ఆలోచనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment