సాక్షి, హైదరాబాద్ : నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్‌కు టీవీ9 ఉద్వాసన పలికింది. ఆయనను సీఈవో బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పించింది. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, సంస్థలో కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో యాజమాన్యం గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎబీసీఎల్) వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్‌కు కేవలం ఎనిమిది శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తన నిర్ణయాలే చెల్లుబాటు అయ్యేలా ఒత్తిడి తేవడంతో పాటు, టీవీ9 తన ఆధ్వర్యంలోనే నడవాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా టీవీ9లో మెజారిటీ వాటా కలిగిన శ్రీనిరాజు తన వాటాలను అలంద మీడియాకు విక్రయించిన విషయం విదితమే.
చదవండి:(టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదు)
మరోవైపు టీవీ9 వ్యవహారంలో నటుడు శివాజీ నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. టీవీ9లో నటుడు శివాజీకి కూడా వాటా ఉన్నట్లు ... రవిప్రకాశ్ నుంచి ఆయన ఈ షేర్లు కొన్నట్లు తెలుస్తోంది. టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసుకున్న అనంతరం ఈ కొనుగోలు ప్రక్రియను సవాల్ చేస్తూ శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సవాల్ కూడా చేశాడు. అయితే రవిప్రకాశ్ ప్రోద్బలంతోనే శివాజీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలకు ఊతమిస్తూ రవిప్రకాశ్, శివాజీ కలిసి ఉన్న ఓ ఫోటో గత ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందుకే ఆరునెలలకు ఓసారి ఆపరేషన్ ’గరుడ’ అంటూ హడావుడి చేసే శివాజీకి టీవీ9 ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివాజీని కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే...టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి. ఏబీసీఎల్ కంపెనీలో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉండగా, ఆ సంస్థలో ఓ ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్‌గా హోదా పొందిన రవిప్రకాశ్, ఆయన అసోసియేట్స్‌కు సంస్థలో దాదాపు 8 శాతం వాటా ఉంది. ఏబీసీఎల్‌లో 90 శాతానిపైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకుని ఆగస్టు (24) 25న నగదు కూడా చెల్లించింది. దీనికి అనుగుణంగానే ఆ షేర్లు మొత్తం కూడా అలందా మీడియా పేరు మీద ఆగస్టు 27వ తేదీన డి-మ్యాట్ రూపంలో బదిలీ కూడా జరిగింది.
దీంతో ఏబీసీఎల్ యాజమాన్యం అలందా చేతికి మారినట్లయ్యింది. ఈ లావాదేవీని గుర్తిస్తూ, ఏబీసీఎల్ కంపెనీ తన రికార్డుల్లో నమోదు కూడా చేసుకుంది. సంబంధిత పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో దాఖలు కూడా చేశారు. ఏబీసీఎల్ యాజమాన్యం చేతులు మారడంతో అలందా మీడియా సంస్థ తరపున నలుగురు డైరెక్టర్లను ఏబీసీఎల్ డైరెక్టర్ల బోర్డులో నియమించేందుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతూ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు అధికారికంగా పంపించింది. ఈ తీర్మానాల మీద ఒకసారి రవిప్రకాశ్, మరోసారి ఎంకెవీఎన్ మూర్తి అనే మరో డైరెక్టర్ ఏబీసీఎల్ డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు.
ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మార్చి 29, 2019న అనుమతి మంజూరు చేస్తూ ఏబీసీఎల్కు సమాచారం పంపింది. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్ నిర్వహించేందుకు రవిప్రకాశ్ శతవిధాలా అడ్డుపడుతూ వచ్చారు. దీంతో ఏబీసీఎల్లో 90 శాతానికి పైగా వాటా పొందిన అలందా మీడియాకు చెందిన నలుగురు డైరెక్టర్లు ఏప్రిల్ 23, 2019న సమావేశమై తమ నియామకానికి చెందిన పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో దాఖలు చేయాల్సిందిగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కంపెనీ సెక్రటరీని కోరారు. రవిప్రకాశ్, ఆయన సహచరులు కొందరు దీన్ని అడ్డుకునే దురుద్దేశంతో, ఆ కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు పాత తేదీతో ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. ఇదే విషయాన్ని సదరు కంపెనీ సెక్రటరీ రాతపూర్వకంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఫిర్యాదు చేయడమే కాక, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తాను రాజీనామా చేసినట్లు నకిలీ పత్రాన్ని సృష్టించారని వివరించారు.
కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారంటోంది అలందా మీడియా. సంస్థ నిర్వహణకు సంబంధించి రవిప్రకాశ్ పాల్పడిన అక్రమాలపై టీవీ9 యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు కూడా పెట్టింది. సంస్థకు హాని కలిగించే ఉద్దేశంతో కొందరు వ్యక్తులతో కుమ్మక్కై ఫోర్జరీ పత్రాలు సృష్టించడమే కాక, కంపెనీ నిర్వహణలో యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment