‘గాంధీ, ఉస్మానియా’ రాష్ట్రానికి రెండు కళ్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు రెండు కళ్లవంటివని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులను తీర్చిదిద్దేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా జరిగే శస్త్ర చికిత్సలను 50 నుంచి 60 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఇప్పటికే 12 లక్షల ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందించామన్నారు. ఉద్యోగుల కోసం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక ఓపీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం సేవలు అందించే వైద్యులకు ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు వివరించారు. వైద్యులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.
ఆధునిక హంగులతో ఐసోలేషన్ వార్డు
గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న ఐసోలేషన్ వార్డును ఆధునీకరించి, ఎబోలా, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధుల వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. త్వరలోనే గాంధీ ఆస్పత్రిలో ‘ఆస్పత్రి నిద్ర’ కార్యక్రమంలో పాల్గొని, ఇక్కడి సమస్యలను స్వయంగా తెలుసుకుంటానని అన్నారు. మంత్రితోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ పి.ధైర్యవాన్, డిప్యూటీ సూపరింటెండెంట్ మసూద్, ఆర్‌ఎంవో-1 ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
క్షతగాత్రులకు పరామర్శ
శనివారం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో జరిగిన ప్రమాదంలో గాయపడి, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి రాజయ్య పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడి నష్టపరిహారం ప్రకటిస్తామన్నారు. ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.