మైక్రోప్రాసెసర్ల తయారీకి రెండు ఫౌండ్రీలు | two foundries for the production of Microprocessors | Sakshi
Sakshi News home page

మైక్రోప్రాసెసర్ల తయారీకి రెండు ఫౌండ్రీలు

Published Mon, Aug 10 2015 2:05 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

మైక్రోప్రాసెసర్ల తయారీకి రెండు ఫౌండ్రీలు - Sakshi

మైక్రోప్రాసెసర్ల తయారీకి రెండు ఫౌండ్రీలు

సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో రెండు అత్యాధునిక ఫౌండ్రీలు (మైక్రోప్రాసెసర్లకు అవసరమైన సిలికాన్‌ను శుద్ధీకరించే వ్యవస్థలు) ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(ఏఈఎస్‌ఐ) అధ్యక్షుడు డాక్టర్ వి.కె.సారస్వత్ తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఏర్పాటు కానున్న ఈ ఫౌండ్రీల కోసం ఇప్పటికే కొన్ని సంస్థలను గుర్తించామని, ఫైనాన్షియల్ క్లోజర్స్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు.

ఏఈఎస్‌ఐ హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన  చిన్న, మధ్య తరహా సంస్థలు కేవలం విడిభాగాల తయారీకి పరిమితం కాకుండా తుది ఉత్పత్తులను తయారు చేయగలవిగా ఎదగాలని సూచించారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ టి.సువర్ణ రాజు మాట్లాడుతూ.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రవాణా విమానాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని, 75-90 సీట్ల సామర్థ్యమున్న విమానం రూపకల్పన కోసం హెచ్‌ఏఎల్, ఎన్‌ఏఎల్ ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేస్తున్నాయని తెలిపారు.  
 
కలాం సంస్మరణార్థం అనేక కార్యక్రమాలు: సతీశ్‌రెడ్డి
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవలను గుర్తుంచుకునేలా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు  రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ) డెరైక్టర్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. డీఆర్‌డీవోలో కలాంతో కలసి పనిచేసిన శాస్త్రవేత్తలందరూ సోమవారం ఆర్‌సీఐలో సమావేశమై ఆయనకు నివాళులు అర్పించనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా మిస్సైల్ కాంప్లెక్స్‌కు ఆయన పేరు పెట్టడం వంటి సూచనలు అందుతున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement