
సాక్షి, సిటీబ్యూరో: ముందస్తు ఎన్నికల వల్ల రాజకీయ పార్టీలకు, నాయకులకు ఎలాంటి మేలు చేకూరనుందో కానీ.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరం 2019లో జరుగుతాయని భావించి..కొంగొత్తగా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకున్న నవయువతకు మాత్రం ఓటు హక్కు చేజారిపోయింది. సాధారణంగా ప్రతియేటా ఓటరు జాబితా స్పెషల్ రివిజన్ పూర్తయ్యాక జనవరి నెలలో తుది జాబితాను వెలువరిస్తారు. జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండేవారికి ఓటు హక్కు కల్పిస్తారు. వారు జనవరి కంటే ఆరు నెలలు ముందుగానే ఓటరుగా నమోదయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాబోయే సంవత్సరం జనవరి ఒకటో తేదీని ప్రామాణికంగా తీసుకొని ఓటు హక్కు కల్పిస్తారు. ఎన్నికలు ముందస్తుగా జరుగకుండా..నిర్ణీత వ్యవధిలో జరుగుతాయని భావించి 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలనే ఉత్సాహం కొద్దీ గత జూలై నుంచి దరఖాస్తు చేసుకున్న వారు నగరంలో ఎందరో ఉన్నారు.
ఎన్నికలు 2019లోనే జరిగేట్లయితే అలాంటి వారందరికీ ఓటరు గుర్తింపుకార్డు లభించి ఓటు వేసేవారు. కానీ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా షెడ్యూలును కూడా ముందుకు జరపడంతో అలాంటి వారు ఓటర్లుగా నమోదయ్యే అవకాశం లేకుండా పోయింది. 2018 జనవరి ఒకటోతేదీ నాటికి 18 సంవత్సరాల వయసు పూర్తయిన వారికి మాత్రమే ఓటు హక్కు లభించేలా ప్రామాణిక తేదీని నిర్ణయించారు. దీంతో 2018 జనవరి 2వ తేదీనాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారినుంచి 2019 జనవరి ఒకటో తేదీనాటికి 18 ఏళ్ల వయసు నిండేవారందరికీ ఓటు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతోంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు, తాము కోరుకున్న శాసనసభ్యుల్ని ఎన్నుకునేందుకు వారంతా మరో ఐదేళ్లు ఆగాల్సిందే.
అలాంటి వారు నగరంలో దాదాపు రెండు లక్షల మంది వరకు ఉండొచ్చని అంచనా. ఎన్నికలకు ఇంకా సమయముంది కనుక తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చుననుకున్న వారి సంగతలా ఉంచి, ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తులు చేసుకున్నవారు హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనే 30 వేల మందికి పైగా ఉన్నారు. వీరిలో సెప్టెంబర్ మొదటి వారం వరకు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్నవారు దాదాపు 15 వేల మంది ఉన్నారు. వీరు కాక ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు ఇంకా ఎక్కువే ఉన్నట్లు అంచనా. వీరందరి దరఖాస్తుల్ని పెండింగ్‌లో పెట్టారు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు వారికి ఓటు హక్కు లభించదు కనుక పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది.విశ్వసనీయ సమాచారం మేరకు హెదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నవయువత వివరాలిలా ఉన్నాయి.