సాక్షి, సిటీబ్యూరో: ఒకే వ్యక్తికి రెండు చోట్లా ఓటు ఉంటుందా..? అంటే ఉంది. నగరంలో పలు ప్రాంతాల్లో ఒకే వ్యక్తికి వేర్వేరు నియోజకవర్గాల్లోనే కాదు..ఒకే పోలింగ్ కేంద్రంలోనూ రెండు పర్యాయాలు ఓటు ఉంది. ఇలా ఒకే రకమైన పేరు, ఒకే రకమైన ఫొటోలు కలిగి ఉన్న వారు 1,01,470 మంది ఉన్నారు. ఫొటోలు, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా, ఇలా ఐదు అంశాలు ఒకేరకంగా ఉంటే వాటిని (డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్)డీఎస్‌ఈగా పేర్కొంటూ పరిశీలించి తొలగిస్తారు. అలా హైదరాబాద్ జిల్లాలో 1,01,470 డీఎస్‌ఈలో 72,707 మంది ఫొటోలు కూడా మ్యాచ్ అయ్యాయి. అంటే దాదాపుగా వారంతా ఒక్కరేనన్నమాట. అలాంటి ఓట్లను నిబంధనల మేరకు నోటీసులిచ్చి తొలగించనున్నారు. మిగతా వారిలోనూ ఎంతమందివి ఇతర అంశాలతో పోలనున్నాయో తేల్చాల్సి ఉంది. వీరిలో తెలిసీ రెండు, మూడు పర్యాయాలు ఓటర్లుగా నమోదు చేయించుకున్న వారితోపాటు మారిన చిరునామాతో కొత్త ఓటరుగా నమోదు చేసుకొని, పాతది తొలగించుకోని వారు కొందరు. ఉన్న జాబితాలో ఓటు తొలగిస్తే.. ఆందోళనతో తిరిగి నమోదు చేయించుకున్నాక, పాతది మళ్లీ జాబితాలో చేర్చడంతో రెండు పర్యాయాలు జాబితాలో పేరున్న వారు కొందరు ఉన్నారు. ఇలా రకరకాల కారణాలతో డూప్లికేట్లుగా ఉన్న ఓటర్లు ముసాయిదా జాబితాలో లక్షకుపైగా ఉన్నారు. ఆధునిక సాఫ్ట్‌వేర్ సాయంతో ఇలాంటివారిని గుర్తించే చర్యలకు సిద్ధమయ్యారు. క్షేత్రస్థాయి పరిశీలనలతో ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉంటే తొలగించనున్నారు.
తూతూమంత్రగా సర్వేలు..
ఇంటింటికీ తిరిగి ఓటరు జాబితాను ప్రక్షాళన చేశామని, జియో ట్యాగింగ్‌చేసి మరీ కచ్చితంగా ఇళ్లకు వెళ్లేట్లు చేశామని అధికారులు చెప్పినా..అదంతా ఒట్టిదేనని తేలింది. ఓటర్ల ఇళ్లకు వెళ్లకుండానే తూతూ మంత్రంగా సర్వే కార్యక్రమాన్ని ముగించిన బూత్‌లెవెల్ అధికారుల వల్లా డూప్లికేట్ల సమస్య తలెత్తిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక చిరునామాలో ఒకే వ్యక్తి పేరు రెండు పర్యాయాలున్నా కనీసం ఇదేమిటని పరిశీలించిన పాపాన పోకపోవడంతో ఇలా కుప్పలుతెప్పలుగా ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓటర్లున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఓట్ల ప్రయోజనాల కోసం ఎక్కువ చోట్ల నమోదు చేయించుకున్న ఓటర్లు.. నమోదు చేయించిన రాజకీయపార్టీలూ ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల తీరుపై బీజేపీ నాయకుడు పి.వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎన్ని పర్యాయాలు ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం దీన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇలా ఒకే వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓట్లున్న నియోజకవర్గాల్లో యాకుత్‌పురాలో అత్యధికంగా 11,322 మంది, ఆ తర్వాతి స్థానాల్లో బహదూర్‌పురాలో 10,957 మంది, చాంద్రాయణగుట్టలో 10,822 మంది , కార్వాన్‌లో 10,127 మంది ఉన్నారు.మొత్తం 1,01,470 మందికి గాను 72,707 మంది ఫొటోలు కూడా ఒకేలా ఉన్నాయంటే.. వీరి పేర్లు జాబితాల్లోంచి తొలగించనున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విధమైన పోలికలున్నవారు.. ఫొటోలు మ్యాచ్ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment