హైదరాబాద్‌లో మరో రెండు ఎయిర్‌పోర్టులు
హైదరాబాద్:నగరంలో మరో రెండు ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో సర్పంచ్ నుంచి ఎంపీ వరకూ అందర్నీ భాగస్వామ్యం చేయాలన్నారు.ఇప్పటికే నెలరోజుల పాటు అన్ని శాఖలపై సమీక్ష జరిపానని తెలిపారు. అయినా కూడా ఏం చేశారని కొందరు విమర్శిస్తున్నారన్నారు. మరో నెల రోజుల పాటు ఇలానే ఉంటానని కేసీఆర్ తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ లో వ్యవస్థ సక్రమంగా లేదన్నారు. ప్రస్తుతం నగరంలోని వ్యవస్థను సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో 10 డంప్ యార్డ్‌లు ఏర్పాటుచేస్తామని, ఇందులో భాగంగానే జిల్లాలో జాయింట్ కలెక్టర్ల సంఖ్య పెంచుతామన్నారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కూడా దశల వారీగా పెంచుతామన్నారు. త్వరలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకూ అందరికీ శిక్షణా తరగతులు ఇచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామన్నారు.
వెయ్యికోట్లతో మైనర్ ఇరిగేషన్‌ను అభివృద్ధిపరుస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ రాజకీయాలకు కేంద్రంగా మారుతోందని, దానిని సమూలంగా మారుస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో విద్యుత్ కొరత ఉన్న కారణంగా 6వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం తమపై ఉందన్నారు.