
సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులు
నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
* కానిస్టేబుల్, హోంగార్డు అక్కడికక్కడే మృతి...
* సీఐ, కానిస్టేబుల్, హోంగార్డుకు తీవ్ర గాయాలు
సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై కొందరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో కానిస్టేబుల్ లింగయ్యతో పాటు హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే మృతిచెందారు. సీఐ మొగిలయ్య, కానిస్టేబుల్ అరవింద్, హోంగార్డు కిశోర్ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన సీఐ మొగలయ్యతో పాటు ఆయన గన్ మెన్ పరిస్థతి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారినీ హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అయితే కానిస్టేబుల్ కార్బన్ తుపాకీని దుండగులు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇది ఒడిశా దొంగల ముఠా పని అంటున్నారు.
తర్వాత దుండగులు పారిపోవడానికి హైవేపై వెళుతున్న కారును ఆపడానికి ప్రయత్నించారనీ, కానీ, కారు ఆపకపోవడంతో కారులో ఉన్న దంపతులపై ఒక్కసారిగా దుండగులు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో భర్తకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. బాధితుడు తాడేపల్లి వాసి దొరబాబుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని ఐజీ నవీన్ చంద్, జిల్లా ఎస్పీ ప్రభాకర రావులు పరిశీలించారు. దాంతో హైవేలపై పోలీసులు ఆలర్ట్ ప్రకటించారు. కాగా, సూర్యాపేట కాల్పుల ఘటనలో ఓ కీలక ఆధారం లభ్యమైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో దుండగుల ఓటర్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అయితే ఓటర్ ఐడీ కార్డు ఆధారంగా దుండగులు ఒరిస్సాకు చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
గత మూడు నెలల క్రితమే బదిలీపై సూర్యాపేటకు వెళ్లిన సీఐ మొగలయ్య రెండు బీహారీ ముఠాలను అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. అయితే ఒక కేసులో తప్పించుకున్న ఇద్దరు బీహారు ముఠా సభ్యులే కాల్పులకు తెగపడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.