
పోలీసులపై తూటా
ఇద్దరు పోలీసులను చంపి పరారైన దుండగులు
సీఐతో పాటు హోంగార్డుకు తీవ్రగాయాలు
యూపీ ముఠా పనా.. సుపారీ హంతకులా?
ఘటనా స్థలంలో ఒడిశా రాష్ట్ర ఓటరు కార్డు
సీసీటీవీ ఫుటేజీల్లోనూ స్పష్టత కరువు
ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్ బృందం
బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రులు నాయిని, జగదీశ్‌రెడ్డి, డీజీపీ
మృతిచెందిన కానిస్టేబుల్‌కు రూ. 40 లక్షలు, హోంగార్డుకు రూ. 10 లక్షల పరిహారం
ఆసుపత్రిలో కోలుకుంటున్న సీఐ,హోంగార్డు, మరో బాధితుడు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ, హైదరాబాద్: అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై కాల్పులు జరగడం రాష్ర్టవ్యాప్తంగా కల కలం సృష్టించింది. నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని హైటెక్ బస్టాండ్‌లో బుధవారం రాత్రి 12:30 గంటల సమయంలో చోటుచేసుకున్న ఘటనతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బస్టాండ్‌లో తనిఖీ చేస్తూ ఇద్దరు వ్యక్తులను అనుమానించిన పోలీసులు.. వారిని బస్సు నుంచి కిందికి దింపి విచారిస్తుండగానే దుండగులు అకస్మాత్తుగా కాల్పులకు పాల్పడ్డారు. కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే చనిపోయారు. సీఐ మొగిలయ్య, మరో హోంగార్డు కిశోర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. అంతా ఐదు నిమిషాల్లో జరిగిపోయిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాల్పులకు తెగబడిందెవరు?
పోలీసులపై కాల్పులు జరిగిన తీరును కూడా స్పష్టంగా ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. పోలీసు వర్గాల కథనం ప్రకారం సీఐ మొగిలయ్య బృందం విచారిస్తున్న ఇద్దరు అనుమానితులు ఒక్కసారిగా కాల్పులు జరిపి బస్టాండ్ నుంచి పారిపోయారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ కారును ఆపేందుకు ప్రయత్నించారు. అది ఆగకపోవడంతో కారు నడుపుతున్న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ గన్నమని దొరబాబుపై కూడా కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో ఆయన చేతికి బుల్లెట్ గాయమైంది. ఇంత క్రూరంగా కాల్పులకు పాల్పడింది ఎవరనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గరుడ బస్సులే లక్ష్యంగా, మహిళల బంగారు ఆభరణాలను చోరీ చేసే ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠా సభ్యులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారనేది ఒక వాదన. సూర్యాపేట పోలీసులు గతంలో ఈ ముఠాకు చెందిన వారిని పట్టుకోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.
అయితే, ఘటనా స్థలంలో లభించిన ఓటరు కార్డు ఒడిశా రాష్ట్రానికి చెందినది కావడంతో ఆ రాష్ట్రానికి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ ఘటన అనుకోకుండా జరిగిందా లేక యూపీ ముఠాలను నియంత్రించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సూర్యాపేట టౌన్ సీఐ మొగిలయ్యను టార్గెట్ చేసుకుని దాడి జరిగిందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. దుండగులు పారిపోతూ సీఐ గన్‌మ్యాన్ కార్బైన్‌ను కూడా తీసుకెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. దొంగలే అయితే పోలీసులపై కాల్పులు జరిపి, ఆయుధాన్ని తీసుకెళ్తారా అనే సందేహం వ్యక్తమవుతోంది. అయితే వారు సుపారీ తీసుకుని హత్యలు చేసే ముఠా సభ్యులై ఉంటారని, ఎలాగైనా పోలీ సులు పట్టుకుంటారన్న ఉద్దేశంతో కాల్పులు జరిపి పరారై ఉంటారనే చర్చ కూడా జరుగుతోంది. పోలీసులు మాత్రం ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన ఘటన కాదని చెబుతున్నారు. ఈ ఘటనలో మావోయిస్టుల ప్రమేయం లేదని కూడా కొట్టిపారేస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో మరో కానిస్టేబుల్ అరవింద్, సీఐ డ్రైవర్ ఉపేందర్ కూడా బస్టాండ్‌లోనే ఉన్నా వారు దూరంగా ఉన్నట్లు సమాచారం. అయితే అరవింద్ ఘటనా స్థలానికి వచ్చిన వెంటనే ఆందోళనకు గురై అస్వస్థత చెందాడు. ఈయన ప్రస్తుతం కోలుకున్నా వాస్తవం చెప్పలేకపోతున్నాడని పోలీసులంటున్నారు. మరోవైపు నిందితులను గుర్తించేం దుకు ప్రధాన ఆధారమైన సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా ఎలాంటి స్పష్టత రాలేదు. బస్టాండ్‌లో ఉన్న 8 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిం చినా పోలీసులు బస్సెక్కడం, ఇద్దరు దుండగులతో కలిసి బస్సు దిగడం వరకే కనిపిస్తోంది. ఆ తర్వాత పరిణామాలు రికార్డు కాలేదు. అయితే, సీసీటీవీ ఫుటేజీని బట్టి దుండగులు 25 ఏళ్లలోపు వారని తెలుస్తోంది. కాగా, అనుమానితులను విచారించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు తీసుకోలేదని, వారి దగ్గర ఏమైనా మారణాయుధాలున్నాయా లేవా అని తనిఖీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఇక దుండగులు వాడిన బుల్లెట్లను పోలీసులు సేకరించారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలాన్ని, మృతదేహాలను పరిశీలించి ఆధారాలను సేకరించింది.
హోంమంత్రి, జిల్లా మంత్రి సందర్శన
దుండగుల చేతిలో హతమైన ఇద్దరు పోలీసుల కుటుంబసభ్యులను పరామర్శించేందుకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సూర్యాపేట వచ్చారు. ఏరియా ఆస్పత్రి మార్చురీలో ఉన్న లింగయ్య, మహేశ్ మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే ఉన్న వారి కుటుంబాలను పరామర్శించి ఘటనా స్థలమైన హైటెక్ బస్టాండ్‌కు వెళ్లారు. అక్కడ హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. చనిపోయిన కానిస్టేబుల్‌కు రూ. 40 లక్షలు, హోంగార్డుకు రూ. 10 లక్షలు పరిహారం, కుటుంబానికి ఒకరి చొప్పున ఉద్యోగం ఇస్తామన్నారు. పోలీసుల మృతదేహాలకు వారి స్వగ్రామాల్లో గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
సీఐ, హోంగార్డుకు శస్త్రచికిత్స
దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సీఐ మొగిలయ్య, హోంగార్డు కిషోర్‌కు హైదరాబాద్‌లోని కిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. వారి శరీరాల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్లను తొలగించారు. ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో వీరు పూర్తిగా కోలుకునే అవకాశముందని పేర్కొన్నారు. సీఐని, హోంగార్డును మంత్రులు నాయిని, జగదీశ్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులు పరామర్శించారు. మరో బాధితుడు దొరబాబు కూడా హైదరాబాద్‌లోని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నల్లగొండ ఎస్పీ బదిలీ
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులపై కాల్పుల నేపథ్యంలో నల్లగొండ జిల్లా ఎస్పీ టి.ప్రభాకర్‌రావును రాష్ర్ట ప్రభుత్వం బదిలీ చేసింది. నేర పరిశోధన విభాగం(సీఐడీ) ఎస్పీగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్‌ను నల్లగొండ ఎస్పీగా నియమించింది. ఇక ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న రాజేశ్‌కుమార్‌ను కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీగా నియమించింది.
17 ప్రత్యేక బృందాలతో గాలింపు
సాక్షి, హైదరాబాద్: పోలీసులపై కాల్పులకు తెగబడిన దుండగులను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు మొదలయ్యాయి. ఇందుకోసం 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్ తదితర విభాగాల్లోని మెరికల్లాంటి సిబ్బందితో పాటు నల్లగొండ జిల్లా పోలీసులతో ఏర్పాటైన ఈ బృందాలు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. నల్లగొండ సరిహద్దు జిల్లాలు, హైదరాబాద్‌లో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారుల్లో వాహనాల తనిఖీ చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డీజీపీ అనురాగ్ శర్మ ఎప్పటికప్పుడు కేసు పురోగతిని సమీక్షిస్తున్నారు.
మృత్యుంజయుడు మొగిలయ్య
నిజాంసాగర్(నిజామాబాద్): దుండగుల కాల్పుల్లో గాయపడిన సీఐ మచ్చుకూరు మొగిలయ్య మూడుసార్లు మృత్యుంజయుడయ్యారు. నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలం కండేబల్లూరు గ్రామానికి చెందిన ఆయన తొలుత నాలుగేళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. ఆ తర్వాత ఎస్‌ఐగా ఎంపికై పోలీస్ శాఖలో చేరారు. అప్పట్లో హోంమంత్రి మాధవరెడ్డిపై నక్సల్స్ కాల్పుల్లో మొగిలయ్య గాయపడ్డారు. తర్వాత నెల్లూరు జిల్లాలో జరిగిన మరో కాల్పుల ఘటనలోనూ గాయాలతో బయటపడ్డారు. తాజాగా సూర్యాపేట ఘటనలోనూ మృత్యుంజయుడిగా నిలిచారు.