పాపన్నపేట: మంజీరా వరదల్లో శుక్రవారం ఇద్దరు యువకులు చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని పురానాపూల్‌కు చెందిన ఆకుల మహేశ్, వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన భీంపల్లి బాల్‌రాజు సరదాగా గడిపేందుకు ఏడుపాయలకు వచ్చారు. స్నానం చేసేందుకు మంజీరా చెక్‌డ్యాం వద్ద నదిలోకి దిగారు. ఇంతలోనే వరదలు పోటెత్తడంతో ప్రవాహంలో పడి పోయారు. ఒకరు చెక్‌డ్యాంపై ఉన్న ఊచను పట్టుకోగా, మరొకరు బండరాయి ఎక్కి కూర్చున్నారు.
క్షణక్షణం ప్రవాహం పెరుగుతుండటం చూసి వారు ప్రాణభయంతో కేకలు వేయడం మొదలు పెట్టారు. ఏడుపాయల సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్‌ఐ సందీప్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ఏం చేయాలో వారికి అర్థం కాని పరిస్థితి. ఆ సమయంలో నదిపై వంతెన పనులు చేస్తున్న బిహార్ కూలీలు సురేష్, చరణ్‌సింగ్ తాము రక్షిస్తామని ముందుకు వచ్చారు.
దీంతో మిగిలిన కూలీలు వారిద్దరికి తాడు కట్టి నదిలోకి పంపారు. పోటెత్తిన ప్రవాహాన్ని అధిగమిస్తూ ధైర్యసాహసాలతో గంటపాటు కష్టపడి మహేష్, బాల్‌రాజును ఒడ్డుకు చేర్చారు. కాగా, సురేష్, చరణ్‌సింగ్ సాహసానికి మెచ్చుకున్న పోలీసులు నగదు ప్రోత్సాహం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment