సాక్షి, హైదరాబాద్ : మరో కీలకమైన నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లక్షలాది మంది రైతులను ఆదుకునేందుకు వ్యవసాయానికి పెట్టుబడి సాయం పథకానికి శ్రీకారం చుట్టిన సర్కారు.. నిరుద్యోగ యువతపైనా దృష్టి సారించింది. కొత్త రాష్ట్రంలో ఆశించినన్ని ఉద్యోగావకాశాలు రాకపోవటంతో అసంతృప్తితో ఉన్న లక్షలాది నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకు కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. ప్రతినెలా ఆర్థిక సాయం అందించే నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయించింది. ఈ పథకానికి అవసరమైన విధివిధానాలు, అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లోనే ఈ పథకాన్ని ప్రకటించాలని భావిస్తోంది. నిరుద్యోగ భృతి అమలుకు అవసరమైనన్ని నిధుల కేటాయింపులు, సాధ్యాసాధ్యాలపై అధ్యయన బాధ్యతను ఆర్థిక శాఖకు అప్పగించినట్లు సమాచారం. 18 ఏళ్లు నిండి డిగ్రీ పూర్తి చేసి.. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో ఉద్యోగం లేని వారందరినీ ఈ పథకానికి అర్హులుగా పరిగణించే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది నిరుద్యోగులుంటారన్న అంచనాతో లెక్కలేసుకుంది. ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.2 వేల చొప్పున భృతి చెల్లించాలని భావిస్తోంది. కనీసం 18 ఏళ్ల వయస్సు నుంచి గరిష్టంగా 30 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులను ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చాలని భావిస్తోంది. అర్హతలు, విధివిధానాలు, మార్గదర్శకాల తయారీ బాధ్యతను సీఎం కేసీఆర్ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితోపాటు ఆర్థిక శాఖ అధికారులకు అప్పగించినట్లు సమాచారం.
నిరుద్యోగుల లెక్కలపై గందరగోళం
రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులున్నారన్న లెక్కలు ప్రభుత్వ శాఖల వద్ద అందుబాటులో లేవు. వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్‌లో దాదాపు 18 లక్షల మంది అభ్యర్థులు ఇప్పటివరకు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. అలాగే ఉపాధి హామీ పథకంలో దాదాపు 20 లక్షల జాబ్‌కార్డుదారులున్నారు. వీరిలో నిరక్షరాస్యులతోపాటు చదువుకున్నవారూ ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని అంచనాలున్నాయి. అయితే కనీస డిగ్రీ విద్యార్హత, వయసు నిబంధనలతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, మొత్తం 10 లక్షల నుంచి 15 లక్షల మధ్య నిరుద్యోగ భృతి పరిధిలోకి వస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి హామీ మార్గదర్శకాల ప్రకారం వరుసగా 180 రోజులు పని దొరకని వారందరినీ నిరుద్యోగులుగా పరిగణిస్తారు. ఎవరిని, ఏ ప్రాతిపదికన నిరుద్యోగులుగా పరిగణించాలన్న విషయంలో అధికారులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఎందరు నిరుద్యోగులున్నారు? నిరుద్యోగిని నిర్ధారించేందుకు ఏయే అర్హతలుండాలి? ఒక్కొక్కరికి ఎంత భృతి చెల్లించాలి? పథకానికి ఏయే మార్గదర్శకాలుండాలి? అన్న అంశాలపై ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా సమాచారం సేకరిస్తోంది. నిరుద్యోగుల సంఖ్యను గుర్తించేందుకు సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు డిగ్రీ పూర్తి చేసి వారి నుంచి అర్హత ధ్రువపత్రాలతోపాటు తాను నిరుద్యోగినని అఫిడవిట్‌ను తీసుకోవాలని యోచిస్తోంది.
ఏడాదికి రూ.2,400 కోట్ల భారం
దాదాపు 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి చెల్లించాలంటే.. నెలకు రూ.200 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,400 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కాలేజీ యాజమాన్యాల జేబులు నింపుతోందని, దీన్ని అమలు చేసే బదులు నిరుద్యోగులకు జీవన భృతి కల్పించడమే మేలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. వ్యవసాయ పెట్టుబడి పథకానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్న తరుణంలో నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చే భృతికి నిధుల సర్దుబాటు పెద్ద కష్టమేమీ కాదని అధికారులు చెబుతున్నారు.}
ప్రతిపక్షాల ఎత్తుకు పైఎత్తు
సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కావటంతో 2018–19 బడ్జెట్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికల వ్యూహంలో భాగంగా కొత్త జనాకర్షక పథకాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే దాదాపు 70 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే పెట్టుబడి సాయం పథకాన్ని ప్రకటించారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డప్పట్నుంచీ తగినన్ని నోటిఫికేషన్లు రాలేదని నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ప్రతిపక్షాలు సైతం అదే అంశాన్ని ప్రధానాస్త్రంగా ఎంచుకున్నాయి. తాము అధికారంలోకి వస్తే రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ ఎత్తుగడను చిత్తు చేస్తూ ఈ ఆర్థిక సంవత్సరం నుంచే నిరుద్యోగ భృతి పథకాన్ని అమల్లోకి తేవాలని సీఎం భావిస్తున్నారు.
అర్హత ఏమిటి?
డిగ్రీ పూర్తి చేసి.. 18–30 ఏళ్ల మధ్య వయసున్న వారు!
ఎంత మందికి?
10 లక్షల నుంచి 15 లక్షల మంది ఉండొచ్చని అంచనా
Comments
Please login to add a commentAdd a comment