కేంద్ర గ్రాంట్లలో అన్యాయం
తెలంగాణకు ప్రత్యేక హోదా రావాలి
సభలో తీర్మానం చేద్దాం ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన నీతి ఆయోగ్‌కు రాష్ట్రం మద్దతు ప్రకటిస్తే కేంద్రం మాత్రం తాజా బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపిందని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లోనే కాకుండా 14వ ఆర్థిక సంఘం కూడా తెలంగాణను చిన్నచూపు చూసిందన్నారు. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ.40వేల కోట్లు వసూలు చేసుకుం టుండగా గ్రాంట్ల రూపంలో కేవలం రూ.12,823 కోట్లు కేటాయించటం దారుణమన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఒవైసీ మంగళవారం సభలో మాట్లాడారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ విషయంలో కేంద్రం నిర్లక్ష్యాన్ని ఇతర పక్షాల సభ్యులెవరూ లేవనెత్తలేదని, ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం, అటు ఇతర పక్షాలు దీన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. గ్రాంట్లు పెంచడంతోపాటు తెలంగాణకు ప్రత్యేక హోదాను ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సభలో తీర్మానం చేయాలని సూచించారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయంలో తనకు అనుమానం లేదన్నారు. గత బడ్జెట్లో రూ.వేయి కోట్లను కేటాయిస్తే కేవలం రూ.450 కోట్లను కూడా ఖర్చు చేయలేదన్నారు. ఇతర సంక్షేమ శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగులుంటే, మైనారిటీ సంక్షేమ శాఖలో కేవలం వందమంది మాత్రమే ఉండడం నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నించారు.
ఆంధ్రాప్రాంతం వారి నివాసాల వద్దకే పాలనా కేంద్రం
ఎర్రగడ్డలో కొత్త సచివాలయ నిర్మాణాన్ని తాను స్వాగతిస్తున్నానని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ‘కూకట్‌పల్లి ప్రాంతంలో ఆంధ్రాప్రాం తం వారు అధికంగా ఉంటారు. వారికి చేరువ లో సచివాలయం నిర్మించడమంటే ఆంధ్రాప్రాంతం వారికి పాలనాకేంద్రాన్ని చేరువ చేయడమే’ అని పేర్కొన్నారు. పాతబస్తీని ఇస్తాంబుల్‌గా మారుస్తానన్న సీఎం హామీ కార్యరూపందాల్చే సమయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. చార్మినార్ నడకదారి ప్రాజెక్టు పేరుతో చిరువ్యాపారుల పొట్టకొట్టొద్దని కోరారు.