Ayog ethics
-
అభివృద్ధితోనే పేదరిక నిర్మూలన
నీతి ఆయోగ్ చైర్మన్ పనగారియా సాక్షి, హైదరాబాద్: అభివృద్ధితోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియా పేర్కొన్నారు. సరళీకరణ విధానాలతో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. జాతీయ పోలీస్ అకాడమీలో సోమవారం వల్లభాయ్‌పటేల్ సంస్మరణ ఉపన్యాసం చేశారు. కొన్నేళ్లుగా దేశం ఆర్థికాభివృద్ధి సాధించడంతో పేదరికం కొంతమేర తగ్గుముఖం పట్టిందన్నారు. పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 109 మంది ఐపీఎస్, 15 మంది విదేశీయులను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలతో దేశం ఆర్థికంగా పురోగమిస్తోందన్నారు. గ్లోబల్ మార్కెట్‌పై పట్టు సాధిస్తేనే దేశంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణతో కలసి సర్దార్ పటేల్ చిత్ర పటానికి పనగారియా నివాళులర్పించారు. -
నీతి ఆయోగ్‌తో స్థానిక సంస్థల నిర్వీర్యం
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ ఆరోపణ - నిధులు, అధికారాలను హరిస్తోందని ధ్వజం - కార్పొరేట్ శక్తులకే పాలన పరిమితం చేస్తోందని మండిపాటు - రాష్ట్రంలో భవిష్యత్తు కాంగ్రెస్‌దే: జానా, షబ్బీర్ - కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రతినిధులకు శిక్షణ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ ఏర్పాటు ద్వారా దేశంలోని అన్ని స్థానిక సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. స్థానిక సంస్థల నిధులు, అధికారాలను హరిస్తోందని దుయ్యబట్టారు. ప్రజల కోసం కాంగ్రెస్ పాలన అందిస్తే బీజేపీ కార్పొరేట్ శక్తులకు పాలనను పరిమితం చేసిందని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకంలో అధికారులకే పూర్తి అధికారాలను ఇచ్చి ప్రజాప్రతినిధుల హక్కులకు గండికొడుతోందని విమర్శించారు. రాష్ట్రంలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీల మాజీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని జ్యోతి వెలిగించి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల అధికారాల కోసం తమ పార్టీ పోరాటం చేస్తుంద న్నారు. మార్కెట్ యార్డుల్లో ధరల నిర్ణయాధికారం రైతులకే ఉండాలని దిగ్విజయ్‌సింగ్ కోరారు. గ్రామీణ ప్రజా ప్రతినిధుల అధికారాలు, హక్కులు, నిధులు వంటివాటిపై టీపీసీసీ ప్రత్యేకంగా ఒక బుక్‌లెట్‌ను విడుదల చేస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ను పొగిడితే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి కేసీఆర్‌ను తిట్టి వెళ్లారని ఎద్దేవా చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని దిగ్విజయ్ దుయ్యబట్టారు. రాష్ట్రానికి కేంద్రం రూ. 90 వేల కోట్లు ఇచ్చినట్లు అమిత్ షా చెప్పారని, ఆ నిధులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ప్రధాని హామీలు అమలు కావట్లేదు: పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి నీతీ ఆయోగ్ ద్వారా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధుల్లేకుండా చేసిందని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించా రు. స్థానిక సంస్థలకు నేరుగా నిధులు ఇస్తామని కేంద్రం చెబుతున్నా ఆచరణలో అమలు కావడంలేదన్నారు. రాష్ట్రాల్లో పర్యటనల సందర్భంగా ప్రధాని ఇస్తున్న వాగ్దానాలూ అమలు కావడం లేదన్నారు కేంద్ర నిధులతో ఎమ్మెల్యేలను కొంటున్నారా?: ఉత్తమ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 90 వేల కోట్లతోనే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొంటున్నట్టున్నదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ భ్రష్టు పట్టిస్తోందని దుయ్యబట్టారు. 2019లో తమ పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని, మిత్తీ(వడ్డీ)తో సహా బదులు తీర్చుకుంటామని ఉత్తమ్ హెచ్చరించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప మిగిలిన ఏ ఒక్కరూ సంతోషంగా లేరని చెప్పారు. స్థానిక సంస్థల విధులు, నిధుల గురించి అవగాహన పెంచుకోవాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి కోరారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క పైసా రాలేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా పోయేకాలం వచ్చినందుకే ఇలాంటి వాటికి పాల్పడుతున్నాడని విమర్శించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ లక్ష్యాలు, సిద్ధాంతాలను పక్కనబెట్టి అధికారం, పైరవీల కోసం కొందరు పార్టీలు మారుతున్నారని విమర్శించారు. -
ఆగస్ట్ 15లోగా నివేదిక అందిస్తాం
స్వచ్ఛభారత్‌పై ఏర్పాటైన సీఎంల ఉపసంఘం సాక్షి, బెంగళూరు: నీతి ఆయోగ్‌లో భాగంగా స్వచ్ఛ భారత్‌పై ఏర్పాటైన ముఖ్యమంత్రుల ఉపసంఘం ఆగస్టు 15లోగా కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఉపసంఘం 3వ సమావేశం బుధవారం ఇక్కడ జరిగింది. వ్యర్థ పదార్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేసే ‘వేస్ట్ మేనేజ్మెంట్’, స్వచ్ఛ భారత్‌కు అనుబంధంగా సాంకేతిక మండలి ఏర్పాటుపై చర్చించారు. ‘తదుపరి సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. స్వాతంత్ర దినోత్సవంలోగా కేంద్రప్రభుత్వానికి నివేదిక సమర్పించలనుకుంటున్నాం’ అని భేటీ తర్వాత బాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ‘ఓటుకు కోట్లు’ అంశంపై స్పందించేందుకు నిరాకరించారు. ఇక్కడ స్వచ్ఛభారత్‌పై తప్ప మరేమీ మాట్లాడనని అన్నారు. తర్వాత నగరంలోని శంకరమఠాన్ని సందర్శించారు. శృంగేరి శారదా పీఠం పీఠాధిపతి శ్రీభారతీ తీర్థ స్వామీజీని కలిసి, ఆశీస్సు అందుకున్నారు. -
కేంద్ర గ్రాంట్లలో అన్యాయం
తెలంగాణకు ప్రత్యేక హోదా రావాలి సభలో తీర్మానం చేద్దాం ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన నీతి ఆయోగ్‌కు రాష్ట్రం మద్దతు ప్రకటిస్తే కేంద్రం మాత్రం తాజా బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపిందని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లోనే కాకుండా 14వ ఆర్థిక సంఘం కూడా తెలంగాణను చిన్నచూపు చూసిందన్నారు. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ.40వేల కోట్లు వసూలు చేసుకుం టుండగా గ్రాంట్ల రూపంలో కేవలం రూ.12,823 కోట్లు కేటాయించటం దారుణమన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఒవైసీ మంగళవారం సభలో మాట్లాడారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ విషయంలో కేంద్రం నిర్లక్ష్యాన్ని ఇతర పక్షాల సభ్యులెవరూ లేవనెత్తలేదని, ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం, అటు ఇతర పక్షాలు దీన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. గ్రాంట్లు పెంచడంతోపాటు తెలంగాణకు ప్రత్యేక హోదాను ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సభలో తీర్మానం చేయాలని సూచించారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయంలో తనకు అనుమానం లేదన్నారు. గత బడ్జెట్లో రూ.వేయి కోట్లను కేటాయిస్తే కేవలం రూ.450 కోట్లను కూడా ఖర్చు చేయలేదన్నారు. ఇతర సంక్షేమ శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగులుంటే, మైనారిటీ సంక్షేమ శాఖలో కేవలం వందమంది మాత్రమే ఉండడం నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నించారు. ఆంధ్రాప్రాంతం వారి నివాసాల వద్దకే పాలనా కేంద్రం ఎర్రగడ్డలో కొత్త సచివాలయ నిర్మాణాన్ని తాను స్వాగతిస్తున్నానని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ‘కూకట్పల్లి ప్రాంతంలో ఆంధ్రాప్రాం తం వారు అధికంగా ఉంటారు. వారికి చేరువ లో సచివాలయం నిర్మించడమంటే ఆంధ్రాప్రాంతం వారికి పాలనాకేంద్రాన్ని చేరువ చేయడమే’ అని పేర్కొన్నారు. పాతబస్తీని ఇస్తాంబుల్‌గా మారుస్తానన్న సీఎం హామీ కార్యరూపందాల్చే సమయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. చార్మినార్ నడకదారి ప్రాజెక్టు పేరుతో చిరువ్యాపారుల పొట్టకొట్టొద్దని కోరారు. -
‘నీతి’ వైస్ చైర్మన్ పదవి గౌరవంగా భావిస్తున్నా: అరవింద్ పనగడియా
న్యూయార్క్: ప్రణాళికా సంఘం స్థానంలో తీసుకొచ్చిన నీతి ఆయోగ్‌కు తొలి ఉపాధ్యక్షుడిగా తనను నియమించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ప్రముఖ భారతీయ-అమెరికన్ ఆర్థికవేత్త అరవింద్ పనగడియా అన్నారు. ‘నియమాకంతో నన్ను గౌరవించారు. ప్రధాని మోదీతోపాటు భారత్‌లోని విధానకర్తలతో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా’ అని పేర్కొన్నారు. ఆయన ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కొలంబియా వర్సిటీ ఈమేరకు ఓ ప్రకటనలో తెలిపింది.