సాక్షి, ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేకమేమి లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నప్పటికీ పెద్దగా ఒనగూరిందేమి లేదు. దశాబ్ధాలుగా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వేలైన్ నిర్మాణంపై ఆ శలు పెట్టుకున్న జిల్లా వాసులకు ఈ బడ్జెట్‌లోనూ మొండి చేయ్యే ఎదురైంది. బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 2024 వరకూ వంద విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు ప్రకటించినప్ప టికీ అందులో ఆదిలాబాద్ జిల్లా ఉందో.. లేదో స్పష్టత లేదు. ఇక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కేటాయింపుల్లో మనకు భాగస్వామ్యం దక్కుతుందన్న ఊరట తప్పితే ప్రత్యేకంగా జిల్లాకు ఏమి దక్కలేదు.
ఆశలపై నీళ్లు...
రైల్వే లైన్‌పై జిల్లా ప్రజలు కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై పెట్టుకున్న ఆశలు మరోసారి వమ్మయ్యాయి. జిల్లా నుంచి బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఉండడంతో సర్కారు కరుణిస్తుందని ప్రజలు ఆశ పెట్టుకున్నారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ రైల్వే లైన్‌ను నిర్మించేందుకు అంగీకరించాయి. దీనికోసం రూ.2,700 కోట్లు అంచనాలు వేశారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో ఈ ప్రాజెక్టు అసలు మొదలవుతుందా.. లేదా.. ఇంకెన్ని సంవత్సరాలు వేచి చూడాలన్న మీమాంస ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుపై చిన్న ఆశ చిగురిస్తుంది. బడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా 2024 వరకు వంద విమానాశ్రయ కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం మంజూరు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ వందలో మనది ఉంటుందా.. అనే ఆశ కలిగిస్తుంది.
కొంత ఊరట...
వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, పారిశుధ్యం, తాగునీరు విషయాలను ప్రాధాన్యత అంశాలుగా గుర్తించి బీజేపీ సర్కార్ నిధుల కేటాయింపు జరపగా, అందులో జిల్లాకు కూడా నిధులు అందే అవకాశం ఉంది. పౌష్టికాహారానికి దేశ వ్యాప్తంగా వేల కోట్లు కేటాయించగా, జిల్లాకు అమితంగా నిధులు అందుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనత కారణంగా ఇటీవల మాతాశిశు మరణాలు, పౌష్టికాహార లోపంతో అనేక మంది సతమతమవుతున్నారు. జిల్లాలో అనేక మంది యువత సరైన నైపుణ్యత లేక వివిధ అంశాల్లో వెనుకబడుతుండగా, ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు జిల్లాకు కూడా పెద్ద ఎత్తున అవకాశం కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
మౌలిక రంగాలు....
రవాణా, మౌలిక రంగాల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో కేంద్రం దృష్టి పెట్టిన దృష్ట్యా జిల్లాకు కూడా ప్రయోజనం దక్కే అవకాశాలు లేకపోలేదు. పరిశ్రమల ఏర్పాటు, వాణిజ్య రంగాల ప్రోత్సాహానికి బడ్జెట్‌లో కేటాయింపులు జరిపిన దృష్ట్యా జిల్లాలో ఆసక్తి ఉన్న పలువురు దీన్ని అందిపుచ్చుకుంటారన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. మహిళ సంక్షేమానికి నిధుల కేటాయింపు కూడా ప్రస్తుతం అమలవుతున్న కేంద్ర పథకాలకు దోహదపడే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన దృష్ట్యా జిల్లాలోని ఆ వర్గాల ప్ర జలకు కూడా ప్రయోజనం దక్కే ఆస్కారం ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇండ్లు నిర్మిస్తామని బడ్జెట్‌లో పేర్కొన్న దృష్ట్యా జిల్లాలో ఇండ్లు లేనివారికి ఈ పథకం ద్వారా స్వాంతన లభిస్తుందా అనేది వేచిచూడాల్సిందే.
ఆదాయ పన్నులు...
మధ్య, ఎగువ తరగతికి ఊరటనిచ్చేలా ఆదాయ పన్ను స్లాబ్‌లలో మార్పులు జిల్లాలోని అనేకమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉండనుంది. ఇప్పటివరకు 0 నుంచి రూ.5లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉండగా, రూ.5లక్షలు దాటిన వారికి రూ. 2.50 లక్షల నుంచి రూ.5లక్షల వరకు 5శాతం ఆదాయ పన్ను అమలు చేసేవారు. ప్రస్తుతం కొన్ని స్లాబ్‌లను మార్చారు. రూ.5లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు 10 శాతం ఆదాయ పన్ను, అదేవిధంగా రూ.7.50 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12.50లక్షల వరకు 20శాతం, 12.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం, రూ.15 లక్షలు, ఆపై ఆదాయం ఉన్నవారికి 30 శాతం ఆదాయ పన్ను విధిస్తూ స్లాబ్‌లను అమలు పర్చారు.
వ్యవ‘సాయం’పై...
రైతుల ఆదాయాన్ని 2022 వరకు రెట్టింపు చేస్తామన్న ప్రకటనకు కట్టుబడి ఉన్నామని బీజేపీ సర్కార్ బడ్జెట్‌లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రుణాలు విరివిగా ఇవ్వనున్నట్లు పేర్కొనడం జరిగింది. జిల్లాలో ప్రతిఏడాది లక్ష 30వేల మంది రైతులు బ్యాంక్ రుణాలు తీసుకొని సాగు చేస్తుండటం కనిపిస్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీ మా యోజన కింద కోట్ల మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తామని బడ్జెట్‌లో పేర్కొనడం జరిగింది.
జిల్లా రైతులకు కూడా ఈ ప్రయోజనం దక్కుతుందా అనేది వేచి చూడాల్సిందే. కృషి సించాయ్ యోజన ద్వా రా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం అందిస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. జిల్లాలో సూక్ష్మ సాగునీటికి ఆదరణ లభించే అవకాశం లేకపోలేదు. వైద్య నిపుణుల కొరత తీర్చేందుకు ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో చెప్పడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటిది ఏర్పాటు చేస్తే పేదలకు ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
రాష్ట్రానికి మొండిచేయి
కేంద్రం బడ్జెట్‌తో రాష్ట్రానికి, జిల్లాకు ఓరిగిందేమీ లేదు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే బీజేపీ.. ఈ బడ్జెట్‌లో రైతుల సంక్షేమానికి నిధులు నామామాత్రంగానే కేటాయించింది. విద్య, వైద్యానికి పెద్దపీట వేశామని గొప్పలు చెబుతున్నారు. ఆదిలాబాద్‌కు నయాపైసా కేటాయించలేదు.
– జోగు రామన్న, ఆదిలాబాద్ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment