
సాగుకు ప్రాధాన్యత ఏదీ?
‘రైతు నేస్తం’ వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి వెంకయ్య ఆవేదన
- ఉత్తమ రైతులు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులకు పురస్కారాలు
- సినీ, రాజకీయాలకున్న ప్రాధాన్యం వ్యవసాయానికి లేదని వ్యాఖ్య
- ‘సాక్షి’ సాగుబడికి రైతు నేస్తం అవార్డు బహూకరణ
సాక్షి, హైదరాబాద్: సినిమాలు, రాజకీయాలకు ఉన్నంత ప్రాధాన్యం వ్యవసాయానికి లేదని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసారశాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సినిమా తాత్కాలికమని... వ్యవసాయమే శాశ్వతమని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు వ్యవసాయ రంగంపై మీడియా దృష్టిపెట్టాలని సూచించారు. రైతు నేస్తం పత్రిక వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ రైతులు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులకు ఆయన పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ సరైన పంట దిగుబడులు రాక, ప్రకృతి అనుకూలించక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
లాభసాటిగా లేనందువల్ల వ్యవసాయం అంతరించి పోతోందని... రైతులు వ్యవసాయాన్ని వదిలేసి ఇతర రంగాలవైపు వెళ్లిపోతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగం లాభసాటిగా మారాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దిగుబడులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించాలని యోచిస్తున్నామని వెంకయ్య తెలిపారు. వ్యవసాయానికి 10 గంటల నాణ్యమైన విద్యుత్ అవసరమని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మించి ప్రధాన రహదారులకు అనుసంధానించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ రైతులకు మరింత సులభతరమవుతుందన్నారు. ఇందులో భాగంగానే కేంద్రం 2019 నాటికి 65 వేల నివాస ప్రాంతాలకు రహదారుల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ. 19 వేల కోట్లను ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించిందన్నారు. ప్రస్తుతం దేశంలో యూరియా కొరత లేదని... వేపపూత యూరియా అందుబాటులోకి తేవడం వల్ల కొరతను నివారించగలిగామన్నారు. దీనదయాళ్ ఉపధ్యాయ గ్రామజ్యోతి యోజన కింద 2018 మే 1కల్లా మిగిలిన 18,452 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
కేసీఆర్ తెలుగులోనే మాట్లాడతారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని వెంక య్య ప్రశంసించారు. చాలా మందికి ఇంగ్లిష్ జబ్బు పట్టుకుందని...అందువల్ల తెలుగు అంతరిస్తోందన్నారు. అయితే కేసీఆర్ తెలుగులోనే మాట్లాడతారని కితాబిచ్చారు. తెలంగాణ మాండలికాన్ని కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయినా భాష ఒక్కటేనన్నారు. రాష్టంలో 44 మార్కెట్ యార్డుల్లో ఈ-మార్కెటింగ్ అమలు చేస్తున్నామని... వచ్చే ఏడాది అన్ని యార్డుల్లోనూ అమలు చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైతుల ఇబ్బందులను గమనించే ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువులు బాగు చేస్తున్నామన్నారు.
రైతులకు ‘సాక్షి’ సేవలు భేష్
రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంలోనూ... వ్యవసాయ కథనాల ద్వారా ‘సాక్షి’ సాగుబడి ఎన్నో సేవలు అందిస్తోందని నిర్వాహకులు కొనియాడారు. అందుకే రైతు నేస్తం అవార్డుకు ‘సాక్షి’ సాగుబడిని ఎంపిక చేశామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య, మంత్రి హరీశ్‌రావుల చేతుల మీదుగా అవార్డు, జ్ఞాపికను సాక్షి సాగుబడి తరఫున డెస్క్ ఇన్‌చార్జి పంతంగి రాంబాబు అందుకున్నారు. మాజీ ఎంపీ యలమంచిలి శివాజీకి జీవన సాఫల్య పురస్కారాన్ని, మాజీ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డికి విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డెరైక్ట ర్ డాక్టర్ కేశవులు, వెంకట రామన్నగూడెం ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎ.సుజాత, రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ కె.కొండల్‌రెడ్డి తదితరులకు పురస్కారాలు అందించారు.