సాక్షి న్యూస్‌నెట్‌వర్క్: ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సోమవారం అకాల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం సగటున 4 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని సిర్పూర్(యు)లో అత్యధికంగా 60 మిల్లీమీటర్లు, బజార్‌హత్నూర్‌లో అత్యల్పంగా 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెల్లంపల్లి, తాండూరులో వర్షానికి మామిడి కాయలు రాలాయి. సుమారు 10 వేల ఎకరాల్లో నష్టం జరిగిందని అంచనా వేశారు. సిర్పూర్(టి) బెంగాలి క్యాంపులో సుమారు వంద ఎకరాల్లో ఉల్లి, కూరగాయల సాగు దెబ్బతింది. కౌటాలలో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంట తడిసింది. ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో కురిసిన వర్షానికి జొన్న పంట తడిసింది. ఉదయం పూట వర్షం కురవడంతో పదో తరగతి పరీక్ష రాయడానికి వెళ్లే విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు.
కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మెట్‌పల్లి మార్కెట్ యూర్డులో రైతులు, అడ్తిదారులు ఆరబోసిన పసుపు తడిసిపోయింది. మండలంలో సుమారు ఎనిమిది వందల ఎకరాల్లో మామిడి పిందెలు రాలిపోయాయి. మండలంలో 16.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, సారంగాపూర్, రాయికల్, కథలాపూర్ మండలాల్లో కురిసిన వర్షానికి ఉడకబెట్టి ఆరబోసిన పసుపు తడిసిపోగా, వరి, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల్లో మామిడి పిందెలు నేలరాలాయి. జగిత్యాల మండలంలో దాదాపు లక్ష క్వింటాళ్ల వరకు ఉడుకబెట్టిన పసుపు తడిసినట్లు సమాచారం. మార్కెట్‌కు తీసుకువచ్చిన మొక్కజొన్న తడవడంతో వ్యాపారులు కొనుగోలు చేయలేదు.
ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అకాల వర్షం
Published Mon, Mar 30 2015 10:20 PM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM
Advertisement