‘బహదూర్’ వెనుక యూపీ బాద్‌షాలు..!
► ‘ఎంసెట్ లీకేజీ’ కేసులో ప్రధాన నిందితుడు ఎస్బీ సింగ్
► ఎస్బీ సింగ్‌ను అరెస్ట్ చేయకుండా యూపీ నేతల నుంచి ఒత్తిడి
► ఉత్తరప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలు వడబోసిన సీఐడీ
► ఢిల్లీలో ఉన్నాడన్న సమాచారంతో ముమ్మరంగా వేట
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక నిందితుడు ఎస్బీ సింగ్(బహదూర్‌సింగ్) సీఐడీని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఆరు నెలలుగా ఎస్బీ సింగ్ అరెస్ట్ కోసం నాలుగు రాష్ట్రాలు వడబోసిన సీఐడీకి చుక్కలు కనిపించాయి. తీరా చిక్కాడనుకున్న సమయానికి సింగ్ తన పలుకుబడితో ఒత్తిడి తీసుకువస్తున్నట్టు ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది.
యూపీ టు హైదరాబాద్..
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఎస్బీ సింగ్ ఎంసెట్ ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రెండు సెట్ల ప్రశ్న పత్రాలను బయటకు తీసుకువచ్చి హైదరా బాద్‌లోని బ్రోకర్ల ద్వారా దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో విద్యార్థులకు శిక్షణ ఇప్పించాడు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఇప్పటివరకు 62 మంది బ్రోకర్లను అరెస్ట్ చేసింది. కేసులో కీలకంగా ఉన్న కమిలేశ్‌కుమార్‌సింగ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో గుండెపోటుతో అతడు మృతిచెందాడు.
కమిలేశ్ విచారణలో వెల్లడించిన అంశాలను బట్టి కేసులో ఏ1గా మారబోతున్న ఎస్బీ సింగ్‌ను అరెస్ట్ చేయాలని సీఐడీ బృందాలు పలు రాష్ట్రాల్లో వేట సాగించింది. నెలక్రితం అతడు వారణాసిలో ఉన్నట్టు గుర్తించి.. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సీఐడీ అధికారులకు స్థానిక పోలీసులు సహక రించలేదు. పైగా అక్కడ అధికారంలో ఉన్న పార్టీ నేతలు సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు ఉన్నతాధికారులు తెలిపా రు. ఎస్బీ సింగ్ తన పలుకుబడితో నేతల ద్వా రా ఒత్తిడి తీసుకువస్తున్నాడని, ఈ కేసులో సహకారం అందించలేమని వారణాసి పోలీసు లు సీఐడీకి స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక సీఐడీ బృందాలు వెనక్కి వచ్చేశాయి.
ఢిల్లీలో మకాం..
రెండు రోజుల క్రితం ఎస్బీ సింగ్ ఢిల్లీలోని యూపీకి చెందిన పార్టీ నేత గెస్ట్‌హౌస్‌లో షెల్టర్ తీసుకున్నట్టు సీఐడీకి సమాచారం అందింది. దీంతో రెండు బృందాలను సీఐడీ ఢిల్లీకి పంపింది. అయితే ఆ గెస్ట్‌హౌస్ పరిసరాల్లోకి కూడా అనుమతించడం లేదని, పలువురు నేతల ఒత్తిడే దీనికి కారణమని సీఐడీ ఉన్నతాధికారులు చెపుతున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు సీఐడీ ఉన్నతాధికారులు తీసుకెళ్లినట్టు తెలిసింది.
కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు..
ఎనిమిది రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే కొంత మంది నేతలు అరెస్ట్‌ను అడ్డుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారని రాష్ట్ర పోలీస్ శాఖ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అధికారికంగా అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. యూపీ పోలీసు ల తీరు, ఢిల్లీలో యూపీ నేతలు సీఐడీని అడ్డుకున్న తీరుపై ఫిర్యాదు చేసి ఎస్బీ సింగ్‌ను కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తు న్నామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఎస్బీ సింగ్ దొరికితే ఎంసెట్ ప్రశ్నపత్రం లీక్ కేసు పూర్తిగా ఛేదించినట్టవుతుందని, ఆ తర్వాత చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.