సమస్యల ‘పని’ పట్టేలా! | Upadi Hami Scheme Workers Minimum Child Care Facilities | Sakshi
Sakshi News home page

సమస్యల ‘పని’ పట్టేలా!

Published Mon, Feb 25 2019 7:23 AM | Last Updated on Mon, Feb 25 2019 7:23 AM

Upadi Hami Scheme Workers Minimum Child Care Facilities - Sakshi

వైరా మండలంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు  

వైరా: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను సరికొత్తగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా వినియోగించనున్నారు. ఇప్పటి వరకు ఈ పనుల ద్వారా జాబ్‌కార్డులు ఉన్న కూలీలకు దినసరి కూలి డబ్బులు గిట్టుబాటయ్యేలా అధికారులు ప్రణాళిక రూపొందించి కొనసాగించారు. ఇకపై ఎంపిక చేసిన నిర్మాణాలు, అభివృద్ధి పనులను కూడా పూర్తి చేయబోతున్నారు. తద్వారా..ఇటు కూలీలకు, అటు పల్లెలకు ఒకే విడతలో లబ్ధి, మేలు జరిగే సరికొత్త విధానం రూపుదాల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు చేతినిండా పని దొరుకుతోంది. పథకానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిధులను పుష్కలంగా విడుదల చేస్తుండడంతో జిల్లాలోని 20 మండలాల కూలీలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా రూ.52,278కోట్లతో ఉపాధిహామీ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2,92,016 జాబ్‌ కార్డులు ఉండగా..50.89 లక్షల పని దినాలు కల్పించనున్నారు. తాజాగా..ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, గొర్రెల కోసం షెడ్లు, చెరువుల్లో పూడికతీత, పారంఫాండ్స్, డంపింగ్‌ యార్డులు, మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం, గ్రామ పంచాయతీ భవనాలు, వంట గదులు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణాలు చేపట్టవచ్చు. వీటిద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు దీని ద్వారా వచ్చే ఈజీఎస్‌ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు.
 
నిధుల కేటాయింపు ఇలా.. 
ప్రభుత్వ పాఠశాలల్లో వంట గదుల నిర్మాణానికి రూ.2లక్షల నుంచి రూ.6లక్షల వరకు, పాఠశాలల్లో ఒక్కో మరుగుదొడ్డికి రూ.50వేలు, వ్యక్తిగత మరుగుదొడ్లకు రూ.12వేల వరకు నిధులు అందుతాయి. వీటితోపాటు వర్మీ కంపోస్టు యూనిట్లు తయారు చేసుకోవడానికి, ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు ఆస్కారం ఉంది. ఇంకుడు గుంతలకు రూ.4వేలు, రైతులు తమ పొలాల్లో పారం పాండ్స్‌ ఏర్పాటు చేసుకోవడానికి రూ.50వేల వరకు లబ్ధి పొందవచ్చు. దీంతోపాటు గ్రామాల్లో ప్రస్తుతం గొర్రెల షెడ్లకు కూడా రూ.50వేల వరకు, పశువుల పాకకు రూ.80వేల వరకు మంజూరయ్యే అవకాశాలున్నాయి.

ఇంకా.. ఊరిలో సీసీ రోడ్లు, పొలాలకు వెళ్లేందుకు మట్టి రోడ్లు, పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు అందుతాయి. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వలసలను ఉపాధి పనులతో అడ్డుకట్ట వేయవచ్చు. ఈ విషయాలపై నూతన సర్పంచ్‌లు అవగాహన పెంపొందించుకొని ప్రజల సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకునేలా త్వరలో వీరికి ప్రభుత్వం శిక్షణ కూడా ఇవ్వనుంది. జాతీయ ఉపాధిహామీ పథకంతో పాటు 14వ ఆర్థిక సంఘం నిధులు, బీఆర్‌జీఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రత్యేక, సీడీఎఫ్‌ నిధులు, ఎమ్మెల్యే నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు ఆయా ఫండ్స్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని..కావాల్సిన పనులను ఎంపిక చేసుకుని, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకుంటే..పల్లెలు అభివృద్ధిలో పరుగులు తీసేలా చేయొచ్చని కొందరు అధికారులు భావిస్తున్నారు.  

సౌకర్యాలు కల్పించుకుంటాం.. 
ఉపాధిహామీ పనులను సాధ్యమైనంత మేర సద్వినియోగం చేసుకుని, గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించుకుంటాం. ఊరి అభివృద్ధికి విశేషంగా కృషి చేసేలా చూస్తా. ఉపాధిహామీతో గ్రామం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో చేపట్టాల్సిన పనులను గుర్తించి..అధికారుల సూచనలతో చేయిస్తాం.  – ఇటుకల మురళి, అష్ణగుర్తి సర్పంచ్, వైరా మండలం 
 
నిధులను సద్వినియోగం చేసుకోవాలి.. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను సర్పంచ్‌లు సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధికి కృషి చేయాలి. ఈజీఎస్‌ ఫండ్స్‌తో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. కూలీలకు ఉపాధితోపాటు..పలు నిర్మాణాలు చేపట్టేందుకు చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇవి అందరూ తెలుసుకోవాలి.  – బి.ఇందుమంతి, డీఆర్డీఓ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement