‘మా పార్టీలో ఆయన మాటే ఫైనల్’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటే తుది నిర్ణయమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్‌సీ కుంతియా స్పష్టం చేశారు. ఆయన సోమవారం మీడియా చిట్ చాట్ లో ..2019 వరకూ ఉత్తమ్ కుమార్ రెడ్డే తమ కెప్టెన్ అని తెలిపారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు.
పార్టీ కట్టు దాటితే..ఎంతటి నేత అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తమ్ పనితీరు పట్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతృప్తిగా ఉన్నారని కుంతియా పేర్కొన్నారు. పొత్తులపై హైకమాండ్‌దే తుది నిర్ణయం అని వివరించారు. ఎవరితో కలవాలి..ఎప్పుడు కలవాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని, పొత్తులపై పీసీసీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపారు. తన నుంచి, పీసీసీ వరకూ ఏ పదవుల్లోనూ మార్పులు ఉండవన్నారు.
ప్రజలు తమవైపు చూస్తున్నారనడానికి సంగారెడ్డి సభే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతిమండలానికి వెళతామని, అన్నీ స్థాయిల్లో నేతల మధ్య విబేధాలు పరిష్కరిస్తామని తెలిపారు. రాహుల్ సందేశ్ యాత్రలు ఎన్నికల వరకు కొనసాగిస్తామన్నారు. తన నుంచి పీసీసీ వరకూ ఏ పదవుల్లోనూ మార్పులు ఉండవన్నారు. పార్టీలో ఎవరినీ విస్మరించబోమని కుంతియ తెలిపారు. వ్యక్తులపై కాదని, పాలసీలపై తమ పోరాటమన్నారు.
జైరాం రమేష్, మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమన్నారు. ఓటమి చెందిన చోట రాహుల్‌ను తప్పుబడుతున్నవారు... గెలిచిన చోట ఆయనకు క్రెడిట్ ఇవ్వాలి కదా అని అన్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి కేసీఆ అధికారాన్ని లాక్కున్నారని కుంతియా విమర్శించారు. కేసీఆర్, ఆయన కుటుంబం తప్ప తెలంగాణలో ఎవరికీ లబ్ధి జరగడం లేదని ఆయన దుయ్యబట్టారు.