సాక్షి యూనిట్ కార్యాలయంలో మొక్క నాటుతున్న వనజీవి రామయ్య
‘భవిష్యత్ తరాలు బాగుండాలనేదే నా తపన.. తాపత్రయం. పల్లెలు, పట్టణాలు, రహదారులు పచ్చదనంతో నిత్యం నిండుగా కనిపించాలి. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను నాటి.. సంరక్షిస్తే అవి మహా వృక్షాలవుతాయి. గాలి, నీడతోపాటు ఒక్కో మొక్కలో ఒక్కో ప్రత్యేకమైన ఔషధ గుణాలుంటాయి. అలాగే పూలు, పండ్లు మానవ జాతి అవçసరాలను తీరుస్తాయి. ఖాళీ ప్రదేశాలు, ఇంటి పరిసరాలు, నిరుపయోగమైన ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటండి.. వాటిని సంరక్షించండి. తల్లిదండ్రులు.. పిల్లలకు మొక్కల ఆవశ్యకత, వాటి ఉపయోగాలపై వివరించండి’ అంటూ మంగళవారం తనికెళ్లలోని ‘సాక్షి’ యూనిట్ కార్యాలయంలో ‘కాఫీ విత్ సాక్షి’ కార్యక్రమంలో పాల్గొన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య తన అనుభవాలను పంచుకున్నారు.
– సాక్షిప్రతినిధి, ఖమ్మం
సాక్షి, ఖమ్మం: ప్రశ్న: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంపై మీ అభిప్రాయం?
రామయ్య: హరితహారం మంచి కార్యక్రమం. మొక్కల పెంపకం చేయడం అభినందించదగిన అంశం. అయితే నాటిన మొక్కలను పూర్తిగా సంరక్షించినప్పుడే ఫలితం ఉంటుంది. అప్పుడే అవి భవిష్యత్ తరాలకు ప్రయోజనం చేకూరుస్తాయి.
ప్రశ్న: అసలు మొక్కలు నాటాలనే ఆలోచన మీకెలా వచ్చింది?
రామయ్య: నా చిన్నతనంలో 5వ తరగతి చదువుతున్న సమయంలో ఉపాధ్యాయుడు మల్లేశం బోధించిన మొక్కల పెంపకంతో లాభాలు అనే పాఠం నాలో ఒక మహత్తర కార్యానికి అంకురార్పణ చేసింది. ఈ ఆలోచనను నా ఇంటి నుంచే ప్రారంభించాను. ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు నాటాను.
ప్రశ్న: ఎన్నేళ్ల నుంచి మొక్కలు నాటుతున్నారు?
రామయ్య: గత 48 ఏళ్ల నుంచి మొక్కలు నాటుతూనే ఉన్నా. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా.. అక్కడ తప్పనిసరిగా మొక్కలు, చెట్లు ఉండాల్సిందే. ఎందుకంటే చెట్లు లేనిదే మానవ మనుగడ లేదు. భూమిపై నివసించే జీవకోటి రాశులకు పుట్టింది మొదలు చనిపోయేంత వరకు చెట్లతోనే పని.
ప్రశ్న: మొక్కల పెంపకానికి మీరు చేస్తున్న ప్రచారమేంటి?
రామయ్య: వనాల పెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా. ఏ శుభ కార్యానికి వెళ్లినా బహుమతిగా మొక్కలనే అందించి.. నాటమని చెబుతుంటా. నా మనుమరాళ్లకు హరిత లావణ్య, చందనపుష్ప అంటూ మొక్కల పేర్లు పెట్టాను. వన రక్షణపై వెయ్యి వరకు వన సూక్తులు, 315 శిల్పాలపై మొక్కల చరిత్ర తెలుపుతూ చెక్కాను. ఏ మొక్కను చూపించినా ఆ మొక్క ఉపయోగాన్ని చెప్పగలను. ముందు తరాల ప్రాణవాయువు కోసం మొక్కల పెంపకమే అవసరమని ఊరూరా ప్రచారం చేస్తున్నా.
ప్రశ్న: ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారు?
రామయ్య: చిన్నతనం నుంచి ఇప్పటివరకు కోటిన్నర మొక్కలు నాటా. ప్రభుత్వ స్థలాలు, ఆలయాలు, పాఠశాలలు, రోడ్ల వెంబడి స్థలంలో మొక్కలు నాటా. నాయుడుపేట నుంచి మహబూబాబాద్ వెళ్లే ప్రధాన రహదారి వెంబడి రెడ్డిపల్లి గ్రామం వరకు నాటిన మొక్కలు ఇప్పుడు ఎంతో నీడనిస్తున్నాయి. ఇవే కాకుండా నల్లగొండ జిల్లాలో ప్రభుత్వం తరఫున మొక్కలు నాటా.
ప్రశ్న: ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారంలో ఏ రకం మొక్కలు నాటితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది?
రామయ్య: ప్రస్తుతం ప్రభుత్వం హరితహారంలో నాటుతున్న మొక్కలు నీడనిచ్చేవిగానే ఉన్నా యి. వీటితోపాటు ఇంకా పండ్ల మొక్కలు నాటి తే అవి నీడతోపాటు ఫలాలు కూడా ఇస్తాయి. 20చెట్ల చొప్పున కొంతమంది కూలీలకు అంది స్తే.. అవి వారు పెంచి పెద్దచేసి వాటి ఫలాలను అనుభవిస్తూ ఉపాధి కూడా పొందుతారు. అదే విధంగా రోడ్ల వెంబడి నాటిన మొక్కలను రోడ్డు వెడల్పు చేసే పేరుతో తొలగిస్తున్నారు. దీంతో అనుకున్న లక్ష్యం నెరవేరదు.
ప్రశ్న: చివరగా మొక్కల పెంపకంపై మీరిచ్చే సందేశం?
రామయ్య: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. నాటిన ఆ మొక్కలను సంరక్షించాలి. ఇళ్లు, చేలల్లో ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ మొక్క నాటాలి. అప్పడే భావితరాల భవిష్యత్‌ను కాపాడిన వారమవుతాం. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా మొక్కల ప్రా«ధాన్యం తెలిపేందుకు కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ పక్కనే చెట్లు ముద్రిస్తే మొక్కల పెంపకంపై ప్రపంచమంతా నయా పైసా ఖర్చు లేకుండా మొక్కల పెంపకం గురించి ప్రచారం లభిస్తుంది. మనందరం చాలెంజ్‌గా తీసుకుని మొక్కలు ఎక్కువ మొత్తంలో నాటాలి.
Comments
Please login to add a commentAdd a comment