రైతులపైనా 'వ్యాట్'..! | VAT on farmers | Sakshi
Sakshi News home page

రైతులపైనా 'వ్యాట్'..!

Published Mon, Mar 9 2015 3:19 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

VAT on farmers

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ బాదుడు నుంచి రైతులనూ మినహాయించడం లేదు. సబ్సిడీపై సూక్ష్మసేద్యం పరికరాలు పొందే రైతుల నుంచి ముక్కుపిండి మరీ వ్యాట్ వసూలు చేస్తోంది. నీటి యాజ మాన్య పద్ధతులను పాటించడం ద్వారా తక్కు వ నీటితో ఎక్కువ సాగు చేసే సూక్ష్మసేద్యం పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రోత్సహిస్తూ, సబ్సిడీ కూడా ఇస్తూ.. మరోవైపు ఇలా రైతులపై భారం మోపడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాట్ భారం లేకుండా చూడాలని రైతులు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో రైతులు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావును సంప్రదించినట్లు సమాచారం.

ఒక హెక్టారుకు మించితే 'వ్యాటే'..
సూక్ష్మసేద్యం కోసం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం(ఉచితంగా), బీసీలకు, ఐదెకరాలలోపున్న ఓసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ అందిస్తోంది. తమకు ఇష్టమైన సూక్ష్మ సేద్య కంపెనీ పరికరాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు. గతేడాది వరకు కేవలం ఒక హెక్టారు మేరకే సూక్ష్మసేద్యం పరికరాలపై సబ్సిడీ ఇచ్చేవారు. తెలంగాణ సర్కారు దీనిని ఐదు హెక్టార్ల వరకూ పెంచింది. గతంలో ఒక హెక్టారుకు రూ. లక్ష ఖర్చు అయ్యేది. దానికి 5 శాతం వ్యాట్ చొప్పున రూ. 5 వేలను ప్రభుత్వమే చెల్లించేది. రెండు హెక్టార్లు మొదలుకొని ఐదు హెక్టార్ల వరకూ రైతులు సూక్ష్మసేద్యం పరికరాలను కొనుగోలు చేయాలంటే 5 శాతం వ్యాట్ చెల్లించాల్సిందేనని.. దాన్ని తాము చెల్లించబోమని సర్కారు చేతులెత్తేసింది. దీంతో వేలాదిమంది రైతులు వ్యాట్ భారం మోయాల్సి వస్తోంది.

విచిత్రమేంటంటే ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీపై సూక్ష్మసేద్యం పరికరాలను ఇస్తున్నా.. హెక్టారుకు రూ. 5 వేల చొప్పున వారు వ్యాట్ చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాది 75 వేల మంది రైతులు సూక్ష్మసేద్యం కోసం దరఖాస్తు చేసుకోగా.. అందులో 15 వేల మందికి ఇప్పటికే సూక్ష్మసేద్యం పరికరాలను మంజూరు చేశారు. వీరిలో సుమారు 4 వేల మంది వ్యాట్ నుంచి మినహాయింపు పొందగా.. 11 వేల మంది వ్యాట్ చెల్లించారని ఒక అధికారి అంచనా వేశారు. ఆ ప్రకారం రైతులు రూ.10 కోట్లకుపైగా వ్యాట్ చెల్లిం చినట్లు ఆ అధికారి వెల్లడించారు. వీరిలో రెండున్నర వేల మంది ఎస్సీ, ఎస్టీ రైతులు ఉన్నారు. మరోవైపు 59 వేల మంది రైతులు పరికరాల మంజూరు కోసం వేచి చూస్తున్నారు.

ముందే డీడీ చెల్లించాలి..
రైతుల నుంచి వ్యాట్‌ను ముందే ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. రైతులు పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నాక వారి పంట భూములను సంబంధిత అధికారు లు వచ్చి పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే సూక్ష్మసేద్యం పరికరాలకు అనుమతిస్తున్నట్లు ప్రకటిస్తారు. అనంతరం రైతులు హెక్టారుకు మించి ఉండే భూమికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సొమ్ముపై 5 శాతం చొప్పున వ్యాట్‌ను బ్యాంకులో డీడీ తీసి సమర్పించాలి. ఆ తర్వాత వారికి సూక్ష్మసేద్యం పరికరాలను సంబంధిత కంపెనీ నుంచి ఏర్పాటు చేయిస్తారు. కూరగాయలు సాగు చేసే భూముల్లో సూక్ష్మసేద్యం పరికరాలకు రూ. లక్షకు పైగా ఖర్చవుతుంది. ఆ ప్రకారం చూస్తే ఒక హెక్టారున్న రైతులు ఆ మేరకు వ్యాట్ చెల్లించాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement