సాక్షి సిటీబ్యూరో: మార్కెట్‌లో కూరగాయల ధరలు నానాటికి పెరుగుతుండడంతో సామన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల ప్రారంభంలో నిలకడగా ఉన్న కూరగాయల ధరలు ఒక్కసారి పెరగడంతో పేదలు బెంబేలెత్తిపోతున్నారు. వేసవి ప్రారంభం నుంచి నిలకడగా ఉన్న కూరగాయల ధరలు ఏప్రెల్ ప్రారంభంలోనే అమాంతంగా పెరిగాయి. దీంతో వచ్చే మే, జూన్ , జూలై నెలల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. టమాటా మినహా మార్కెట్‌లో అన్ని రకాల కూరగాయలు ధరలు పెరిగాయి. రైతుబజార్‌లతో పాటు బహిరంగ మార్కెట్లలో కిలో రూ. 60 దాటాయి. ధరల నియంత్రణకు మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నా సరఫరా తక్కువగా ఉండటంతో సత్ఫలితాలివ్వడం లేదు.
శివార్ల నుంచి తగ్గిన దిగుమతులు
ఈ ఏడాది నగర శివారు జిల్లాలైన వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూరగాయాల సాగు చేపట్టడంతో నగరానికి పెద్దమొత్తంలో రవాణా జరిగింది. దీంతో గత మార్చి వరకు కూరగాయాల ధరలు నిలకడగా ఉన్నాయి. దీనికితోడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కూరగాయలు దిగుమతి కావడంతో ధరల్లో పెరుగుదల కనిపించలేదు. దీంతో గత నెల వరకు నగరంలోని రైతుబజార్లలో కూరగాయల ధరలు కిలో రూ. 30 నుంచి రూ. 40 వరుకు అందుబాటులో ఉన్నాయి.
ప్రత్యామ్నాయ చర్యలు కరువు
సీజన్‌లో కూరగాయలు ఎక్కువ దిగుబడి అయితే వాటిని నిలువ చేసి అఫ్‌సీజ్‌లో ధరలు నిలకడగా ఉంచడానికి మర్కెటింగ్, హార్టికర్చర్ శాఖ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. మార్కెటింగ్ శాఖ ద్వారా కూరగాయల ధరల నిర్ధారణ లేదు. ఆఫ్ సీజన్‌లో మార్కెటింగ్ శాఖ ద్వారా కాకుండా ఏజెంట్లు రాష్ట్రంలో నుంచి అందుబాటులో లేని కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేస్తారు. దీంతో వారు నిర్ణయించిన ధరల ప్రకారమే ఆఫ్ సీజన్‌లో కూరగాయలను విక్రయించాల్సి వస్తోంది.
కూరగాయల ధరలు బహిరంగ మార్కెట్‌లో...
టమోటా కిలో రూ. 30 వంకాయ రూ. 30, బెండ రూ.50, పచ్చిమిర్చి రూ.60, కాకరకాయ రూ.50, బీరకాయ రూ.60, కాలిఫ్లవర్ రూ.50, క్యాబేజీ రూ.30, కారెట్ రూ.40, దొండ రూ.50, ఆలుగడ్డ రూ.35, గోకర రూ.60, దోస రూ.40, సొరకాయ రూ.40, పొట్లకాయ రూ. 40, చిక్కుడు రూ.60, అర్వి రూ.50,, చిలుకడ దుంప రూ.50, బీట్‌రూట్ రూ.30, కీర రూ.50, బీన్స్ రూ.100 క్యాప్సికమ్ రూ.40
దిగుమతి తగ్గినందునే
నగర ప్రజల డిమాండ్‌కు సరిపడ కూరగాయల దిగుమతి లేనందున ధరలు పెరిగాయి. శివారు జిల్లాల నుంచి కూడా గత వారం రోజులుగా కూరగాయల దిగుమతి గణనీయంగా తగ్గింది. దీంతో ఇతర రాష్ట్రా నుంచి మార్కెట్‌కు కూరగాయల దిగుమతి చేస్తుండటంతో ధరలు పెరిగాయి. ఏటా ఫిబ్రవరి నుంచి జూలై వరకు «కూరగాయల ధరలు ఎక్కువగానే ఉంటాయి .–కే. శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి,గుడిమల్కాపూర్ మార్కెట్
Comments
Please login to add a commentAdd a comment