సాక్షి, సిటీబ్యూరో: ట‘మోత’ మోగుతోంది. రెండు వారాల క్రితం కిలో రూ.15 పలికిన టమాటా... ప్రస్తుతం రూ.40కి చేరింది. ఇదే వరుసలో మిగతా కూరగాయల ధరలు సైతం భారీగా ఉన్నాయి. ఎండలు మండిపోతుండడం, నీటి కొరతతో ఉత్పత్తి పడిపోవడంతో నగరానికి దిగుమతులు తగ్గాయి. గుడిమల్కాపూర్, ఎల్‌బీనగర్, బోయిన్‌పల్లి, మోండా తదితర ప్రధాన మార్కెట్‌లతో పాటు రైతుబజార్లకు కూరగాయల సరఫరా తగ్గింది. వేసవి దృష్ట్యా నగర సమీప జిల్లా్లల్లో నీటి కొరతతో పంట దిగుబడి పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈసారి దిగుమతులు బాగా తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ఇష్టానుసారంగా టమాటా ధరలు పెంచేశారు. దుకాణాదారులు కిలో రూ.30 నుంచి రూ.40కి విక్రయిస్తున్నారు. రైతుబజార్లలోనూ కిలో రూ.38 చొప్పున అమ్ముతున్నారు. ఇక కాలనీల్లోని చిరు వ్యాపారుల సంగతి చెప్పనక్కర్లేదు. హైబ్రిడ్ టమాటా కిలో రూ.45–48, దేశీ టమాటా రూ.35–40 చొప్పున విక్రయిస్తున్నారు. మార్చి చివరి వారంలో కిలో రూ.10–15, ఏప్రిల్ తొలి వారంలో రూ.15–18 మధ్య ఉన్న ధరలు ఒక్కసారిగా ఇంత మొత్తంలో పెరగడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
50–60 లారీలే...
నగరానికి ప్రధానంగా మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేటతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచే అధికంగా కూరగాయలు దిగుమతి అవుతాయి. ఈ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా, క్యాప్సికం, ఆలు, పచ్చి మిర్చి, బీర్‌నీస్ తదితర ఉత్పత్తుల దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఆయా ప్రాంతాల్లోనూ ఉత్పత్తి తగ్గిపోయిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. రెండు వారాల క్రితం నగరానికి 100–150 లారీల టమాటా దిగుమతి అయితే... ప్రస్తుతం 50–60 లారీలే వస్తోందని తెలిపారు. ఇక బీర్‌నీస్, గోకరకాయ, పచ్చిమిర్చి, వంకాయ, క్యారెట్, చిక్కుడు తదితర కూరగాయల ధరలు కూడా రెట్టింపయ్యాయి. జూన్ వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరికొన్ని రోజులైతే కూరగాయలకు పక్క రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
కూరగాయల ధరలు ఇలా.. (కిలోకు రూ.ల్లో)
Comments
Please login to add a commentAdd a comment