ముందుగా గుండెనిండా గాలిని ప్రశాంతంగా పీల్చుకోండి. బీపీ, సుగర్ లెవెల్స్ అదుపులో ఉన్నాయో లేదో చూసుకోండి. మానసిక ఒత్తిడికి గురికాకుండా మనసును ఆహ్లాదంగా ఉంచుకోండి. ఇదేదో యోగా తరగతుల్లో గురువులు బోధిస్తున్న తీరు అనుకోకండి. ప్రస్తుతం మార్కెట్లకు సరుకులు కొనేందుకు వెళ్లే వినియోగదారులు ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోక పోతే గుండెలు గుభేల్ మనక తప్పదు. కూరగాయల నుంచి..నిత్యవసరాల ధరలు చుక్కలను తాకుతుండడంతో ఏర్పడిన పరిస్థితి. నోటిరుచి మాట దేముడెరుగు.. ముచ్చటగా నాలుగు ముద్దలు కూరలతో తిందామన్నా ఖరీదు చేయలేని దుర్భరత. సామాన్య, మధ్య తరగతి వారికి చెమటలు పట్టిస్తున్న రేట్ల తీరు.
పాలమూరు, న్యూస్‌లైన్ : బస్తాలో డబ్బులు తీసుకుపోతే.. సంచుల్లో సరుకులు తీసుకునే రోజులు వస్తాయన్న నానుడి ఇప్పుడు అక్షరసత్యాలు అవుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యులను కుదేల్ చేస్తున్నాయి. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండు పూటలా పప్పుచారుతో భోజనం చేసే పరిస్థితులు లేకుండా పోతున్నాయని పేద, మధ్యతరగతి వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు సన్నరకం బియ్యం (బీపీటీ) ధర కొద్దిగా తగ్గినట్లు కనిపించినా మళ్లీ రెక్కలొచ్చాయి. మూడు నెలల క్రితం వరకు క్వింటాల్ రూ.4వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.5 వేలకు చేరాయి.
పప్పుల విషయానికొస్తే ఆరుమాసాల కిందట రూ.50 నుంచి రూ.60 ఉన్న పెసర, కందిపప్పు ధరలు ఏకంగా రూ.80 నుంచి రూ.100కు చేరాయి. సాధారణంగా పెసర, కందిపప్పులను వారంలో కనీసం నాలుగురోజులైనా వినియోగిస్తుంటారు. పెరిగిన ధరలతో రెండు రోజులు కూడా వినియోగించే పరిస్థితి లేకుండా పోయింది. చట్నీలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మసాల వంటలతోపాటు ముఖ్యంగా చట్నీలకు ఉపయోగించే కొబ్బరి ధరకూడా అమాంతంగా పెరిగి పోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఎండు కొబ్బరి రూ.120 పలుకుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు సన్న బియ్యం (బీపీటీ) ధరలు కొద్దిగా తగ్గినట్లు కనిపించినా, మళ్లీ వాటికి రెక్కలు వచ్చాయి. పప్పుల ధరలదీ అదేబాట.
కూరగాయలదీ అదే రూటు
కూరగాయలను కొనుగోలు చేయాలంటేనే అంతా హడలెత్తి పోతునానరు. రూ.100 తీసుకుని మార్కెట్‌కు వెళితే చిన్నపాటి సంచి నిండా కూడా రావడం లేదు. మొన్నటి వరకు కిలో రూ.10 పలికిన టమాట ప్రస్తుతం రూ.24కు ఎగబాకింది. బెండకాయ మినహా దేన్ని ముట్టుకున్నా కిలో రూ.20కి పైమాటే. ప్రస్తుతం జిల్లాలో కూరగాయలసాగు తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ధరలకు రెక్కలొస్తున్నాయి. ఉల్లిగడ్డలు మాత్రం రూ.20 పలుకుతుండటంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.
నోరు కట్టుకోండి..!
Published Wed, May 28 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement