లింగాపూర్‌లో నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం
కామారెడ్డి రూరల్ : మండలంలోని లింగాపూర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఆలయంలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు వరకు సుబ్రహ్మణ్య శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవతామూర్తులప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 30న ఉదయం 7:30కు ప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభమవుతాయని, ఏప్రిల్ 1న శిఖర ప్రతిష్ఠ, ధాన్యాది, శయ్యాది, పుష్పాది, ఫలాధివాసముులు, హోమం, 2న అవాహిత దేవతా పూజలు, బలిప్రదానం, గర్త సంస్కారము కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు.
అనుగ్రహ భాషణం
ప్రతిష్ఠాపనోత్సవాల్లో తోగుట రామాపూరం శ్రీ మధనానంద పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ మధవానంద సరస్వతీతో యంత్ర ప్రాణ ప్రతిష్ఠా కళాన్యాసము, మహాభిషేకం, కుంభాభిషేకం, స్వామీజీ అనుగ్రహాభాషనం ఉంటాయ తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు అన్నదానం, సాయంత్రం సాయంత్రం భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు పూలు, పండ్లు, పూజ సామగ్రి నవధాన్యాలు, పగడాలు, ముత్యాలు, నవరత్నాలు, యంత్రం కింద వేయడానికి తీసుకురావచ్చన్నారు.
2న దేవదాయశాఖ మంత్రి రాక
విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగం గా ఏప్రిల్ 2న నిర్వహించనున్న కార్యక్రమాలకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వవిప్ గంపగోవర్ధన్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేలు హాజరవుతారని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఆలయ విశిష్టత
లింగాపూర్ గ్రామంలోగల శ్రీవేంకటేశ్వర పురాతన ఆలయం భక్తులకు కొంగు బంగారంగా, కోరికలు తీర్చే వెంకన్నగా పేరుంది. కాల క్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు జీర్ణోద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమలతిరుపతి దేవస్థానం నిత్య ధూపదీప నైవెద్య పథకం కింద సహాయం అందించింది. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ సర్వశ్రేయో నిధి (సీజీఎఫ్) కింద రూ.30 లక్షలు ఆలయ నిర్మాణానికి మంజూరు చేసింది. టీటీడీ దేవతామూర్తుల విగ్రహాలను అందించింది. ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు ఐక్యంగా ఆలయ పునర్నిర్మాణానికి ముందుకు వచ్చి సుమారు రూ.కోటి వ్యయంతో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment