కళాశాల భవనం మ్యాపును పరిశీలిస్తున్న సందీప్‌కుమార్
న్యూశాయంపేట: వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం బొల్లికుంట సమీపంలోని రామకృష్ణాపురంలో త్వరలో వెటర్నరీ కళాశాల ప్రారంభం కానుంది. కళాశాల నిర్వహణ కోసం ఎంపిక చేసిన అద్దె భవనాన్ని పశుసంవర్ధక, మత్స్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పీవీ.నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ సందీప్‌కుమార్‌సుల్తానియా శుక్రవారం పరిశీలించారు. ఉదయం ఇక్కడికి చేరుకున్న ఆయన కళాశాల ఏర్పాటుకు సంబంధించిన తరగతి గదులు, ల్యాబ్‌లు విద్యార్థులకు కావాల్సిన వసతుల గురించి ఆరా తీశారు.
కళాశాలలో చేపట్టాల్సిన పనుల గురించి ప్రిన్సిపాల్ ఏకాంబ్రంకు సూచనలు చేశారు. అనంతరం సందిప్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేకంగా వసతి గృహాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాల ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలను పెంచాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం అక్కడి నుంచి మామునూరులో కృషివిజ్ఞాన కేంద్రం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కళాశాల భవనాన్ని పరిశీలించారు.
కళాశాల మ్యాపును పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం రూ.27 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభమయ్యాని ఈ ఏడాది లోపు పనులు పూర్తవుతాయని అధికారులు వివరించారు. అనంతరం కేవీకే, పాలిటెక్నిట్ కళాశాలను తనిఖీ చేసి, వసతులపై ఆరా తీశారు. కృషివిజ్ఞాన కేంద్రం పరిశోధనలకే కాకుండా రైతులకు ఉపయోగకరంగా ఉండాలన్నారు. రైతులకు అందిస్తున్న శిక్షణల గురించి అడిగి తెలుసకున్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న వెటర్నరీ కళాశాల ఆవరణలో గెస్ట్ హౌస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆరేళ్లకే పాడవుతాయా..
పాలిటెక్నిక్ కళాశాల తనిఖీ సమయంలో కళాశాలలోని బాలికల వసతి గృహంలో తలుపు చెదలు పట్టి ఉండడాన్ని గమనించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం నిర్మించి ఆరు సంవత్సరాల లోపే ఫర్నిచర్ శిథిలం కావడమేంటని అక్కడ ఉన్న అధికారులను మందలించారు. వెంటనే కొత్త తలుపులను బిగించాలని ఆదేశించారు.
ఆదర్శంగా తీర్చిదిద్దాలి
త్వరలో ప్రారంభం కానున్న వెటర్నరీ కళాశాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కృషితోనే 50 సీట్లతో వెటర్నరీ కళాశాల ప్రారంభమవుతోందని తెలిపారు. వారంలో వెటర్నరీ కౌన్సిల్ బృందం రానుందని పేర్కొన్నారు. త్వరలో పక్కా భవనం కూడా నిర్మితమవుతుందని చెప్పారు. కౌన్సెలింగ్ అనంతరం ఆగస్టు–సెప్టెంబర్ మధ్యలో తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.
ఆయన వెంట రిజిస్ట్రార్ రవీందర్‌రెడ్డి, అసోసియేట్ డీన్ వీరోజీరావు, వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్, అసోసియేట్ డీన్ ఏకాంబ్రం, అర్బన్, రూరల్ జిల్లా పశువైద్యాధికారులు పరంజ్యోతి, వెంకయ్యనాయుడు, కేవికే కోఆర్డినేటర్ దైదా కృష్ణప్రసాద్, ఎల్‌ఆర్‌ఎస్ హెడ్ హరికృష్ణ, సతీష్‌కుమార్, డీఈ దేవేందర్, ఏఈ శ్రీనివాస్, సుబ్బారావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment