నా నగరం జనంతో నిండిపోనీ..
♦ కులీ కుతుబ్‌షా కవితను ఉటంకించిన ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ
♦ మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ప్రసంగం
♦ కులీ పాలనలో ఆచరణాత్మక, లౌకిక ధోరణులకు పెద్ద పీట
♦ అనతికాలంలోనే సకల కళలు వికసించాయి
♦ వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నిలిచిందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: 1590–91లో కులీ కుతుబ్‌షా హైదరాబాద్ నగర నిర్మాణాన్ని ప్రారంభించారని, ‘నా నగరం జనంతో నిండిపోనీ, చెరువులోని చేపల మాదిరిగా వర్ధిల్లనీ’ అని రెండు పంక్తుల కవిత్వంతో తన ఆకాంక్షను అక్షరీకరించారని ఉప రాష్ట్రపతి ఎం.హమీద్ అన్సారీ పేర్కొన్నారు. కుతుబ్‌షాహీల వంశం 1520–1687 మధ్య కాలంలో 164 ఏళ్లు మాత్రమే హైదరాబాద్ నగరాన్ని ఏలినా, ఇంత తక్కువ కాలంలో వాస్తు కళ, కవిత్వం, సంగీతం, నాట్యం, పాక కళలు వికసించాయని ప్రశంసించారు.
అంతర్జాతీయ వ్యాపారానికి కీలక కేంద్రంగా, సంస్కృతి సంప్రదాయాలకు మారు పేరుగా నగరం నిలిచిందన్నారు. కుతుబ్‌షాహీల పాలనలో ఆచరణాత్మక, లౌకిక ధోరణులకు పెద్ద పీట వేశారని కొనియాడారు. మహమ్మద్ కులీ కుతుబ్‌షా కాలంలో హిందూ, ముస్లింల మధ్య సన్నిహిత స్నేహం వర్ధిల్లిందని, ఆయన దర్బారులో ముస్లింలు, ముస్లిమేతరులకు సమ ప్రాతినిధ్యం లభించిందన్నారు. హిందువులు, పార్సీలు.. అందరి పట్ల కులీ కుతుబ్‌షా ఉదారంగా వ్యవహరించేవారని చరిత్రకారులు రాశారని పేర్కొన్నారు. ఆయన మతవాది కాదన్నారు.
గురువారం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ)లో మహమ్మద్ కులీ కుతుబ్‌షాపై హమీద్ అన్సారీ ఉపన్యాసం చేశారు. ‘దక్కన్ రాజ్యాల పాలన గురించి రెండు అంశాలను ప్రముఖంగా చెప్పుకోవాలి. పరిపాలన ఎలా సాగాలి, ప్రజల విషయంలో ఎలాంటి విధానాన్ని అవలంబించాలి అనేది మొదటిదైతే.. భారత ఉపఖండంలో బలమైన శక్తులతో ఎలా సంఘర్షించాలన్నది రెండో అంశం’ అని చెప్పారు.
ప్రేమైక కవిత్వం.. మృదు వ్యక్తిత్వం
దక్కనీ ఉర్దూకు తనదైన శ్రేష్టత్వం ఉందని, స్వయంగా కులీ కుతుబ్ షా కవితలు రాశారని అన్సారీ తెలిపారు. జల తరంగాల తరహాలో తన కవితలు అత్యంత సహజమైనవని కులీ చెప్పుకున్నారని గుర్తు చేశారు. పర్షియన్ శైలీ కవిత్వానికి అంకురార్పణ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రముఖ కవులు తులసీదాస్, మీరాబాయి, సూర్‌దాస్‌ల సమకాలికుడైన కుతుబ్‌షా తన కవిత్వంలో ప్రేమైక ప్రపంచం, మార్మిక అనుభూతులకు పెద్దపీట వేశారని వివరించారు. క్షమాగుణం, మృదుత్వంతో కులీ కుతుబ్‌షా వ్యక్తిత్వం అలరారేదని పేర్కొన్నారు.
దక్కనీ ఉర్దూ కవిత్వంలో తెలుగు పదాలు
తెలుగు భాషపై కులీ కుతుబ్‌షా విశాల హృదయం కలిగి ఉండేవారని, తెలుగును తన మాతృ భాషగా పరిగణిం చేవారని చెప్పారు. దక్కనీ ఉర్దూ కవిత్వం లో తెలుగు పదాలను పొందుపరిచేవారని తెలిపారు. అధికారిక ఫర్మానాలు, ప్రకట నలు తెలుగు, ఉర్దూ 2 భాషల్లోనూ ఉండే వన్నారు. కులీ వారసుల్లో ఒకరు కూచి పూడి నాట్య రీతికి పోషకుడు కావడం ఏమాత్రం యాదృచ్ఛికం కాదని తెలి పారు.
ప్రాచీన ఏథెనీయన్స్‌ల మాదిరి గానే హైదరాబాదీలు వారి నగరంతో బంధాన్ని పెనవేసుకున్నారని చెప్పారు. హైదరాబాద్ ప్రజల్లో దక్కనీ తెహజీబ్, సహనం, సౌమ్యతను రంగరించేందుకు కులీ ప్రయత్నం చేశారన్నారు. కార్యక్ర మంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వర్సిటీ వీసీ డాక్టర్ అస్లం పర్వేజ్ పాల్గొన్నారు.