
విశ్వనగరం..ఐటీ హబ్..హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు ఘన చరిత్ర ఉంది. నాలుగుశతాబ్దాల చరిత్ర కలిగినభాగ్యనగరం.. నాడు నిజాం స్టేట్.. ఉమ్మడి తెలుగురాష్ట్రాలకు రాజధాని. నేడు తెలంగాణ రాజధాని..ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ నగర నిర్మాత కులీకుతుబ్ షా 452వ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
సాక్షి సిటీబ్యూరో: గోల్కొండప్రభువైన ఇబ్రహీం కులీ కుతుబ్ షా మూడో కుమారుడైన మహ్మద్ కులీకుతుబ్ షా 1566 ఏప్రిల్ 4న గోల్కొండ కోటలో జన్మించాడు. చిన్నతనంత నుంచే కులీ కుతుబ్ షా తెలివైన వాడిగా, ధైర్యవంతుడిగా, అన్నిరంగాల్లోనూ ప్రావీణ్యుడిగా గుర్తింపు పొందాడు. 1580లో ఇబ్రహీం కులీకుతుబ్ షా మరణించాడు. తండ్రి సూచనల మేరకు అప్పటికే అన్ని రంగాల్లో ప్రావీణ్యం పొందిన ముహ్మద్ కులీకుతుబ్ షా 14వ ఏటనే పాలనాపగ్గాలు చేపట్టాడు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన తండ్రి ప్రారంభించిన పనులను పూర్తి చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. కోటలో జనాభా పెరిగిపోవడంతో ఇళ్ల నిర్మా్ణం సమస్యగా మారింది.. ఈ నేపథ్యంలో భాగ్యనగర నిర్మాణానికి బీజం పడింది. తండ్రి కోరిక మేరకు మూసీ నదికి దక్షిణాన నగరం నిర్మించాలని రంగం సిద్ధమైంది.
దక్షిణ పరీవాహక ప్రాంతం, చార్మినార్ ప్రాంతాల్లో నేలను పరీక్షించారు. అలాగే నగరం ఉత్తర ముఖంగా ఉండేలా భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. గోల్కొండ నుంచి ముసొలిపట్నం (మచిలీపట్నం) వెళ్లే మార్గంలో తూర్పు నుంచి పడమరకు 90 డిగ్రీల కోణంలో ఉత్తరం, దక్షిణాన్ని కలిపేలా నగరాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అదేవిధంగా చార్మినార్‌కు నాలుగు వైపులా విశాలమైన రోడ్డు ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించారు. చార్మినార్‌కు పడమర వైపు బజార్, ఉత్తర దిశలో చార్‌సూ హౌస్ ( నేడు గుల్జార్‌హౌస్), దానికి నాలుగు వైపులా కమాన్‌లు నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. కమాన్‌ల పడమర వైపు రాజ మహల్‌లు, తూర్పు వైపున జనావాసాలు నిర్మించాలనుకున్నారు. చార్మినార్‌ను కేంద్రంగా చేస్తూ ఐదుమైళ్ల విస్తీర్ణంలో నాలుగు వైపులా రహదారులను ఏర్పాటు చేశారు. అలా భాగ్యనగరం నిర్మితమైంది.
తెలుగు భాషకు పెద్దపీట
కుతుబ్ షాహీ పాలనలో ప్రత్యేకంగా ఇబ్రహీం, ముహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో తెలుగు భాషా, సాహిత్యం విరాజిల్లింది. ఇబ్రహీం కుతుబ్‌షా స్వయంగా తెలుగులో కవితలు రాయడమేగాక, కవితా పఠనాలు నిర్వహించాడు. వీరి హయాం తెలుగు సాహిత్యానికి స్వర్ణ యుగంగా చరిత్రకారులు పేర్కొంటారు.
తెలుగులోనే ఫర్మానాలు
కులీకుతుబ్‌షా తల్లి విజయనగర సామ్రాజ్యానికి చెందిన మహిళ కావడం, అతని భార్య చంచల గ్రామానికి చెందిన యువతి కావడంతో ముహ్మద్ కులీ కులీకుతుబ్‌షా తెలుగు భాషాను ఆనర్గళంగా మాట్లాడటమే కాకుంగా తెలుగు భాషలో కవితలు రాసినట్లు చరిత్ర చెబుతోంది. అ రోజుల్లో సంస్థాన అధికార భాషగా పార్సీ కొనసాగుతున్నా.. కుతుబ్ షాహీ హయాంలో తెలుగు భాషను ఎంతో ఆదరించారు. తెలుగు కవులకు జాగీర్లు ఇచ్చారు. ఫర్మనాలు ( ప్రభుత్వ ఆదేశాలు ) సైతం తెలుగులోనే జారీ చేయడం విశేషం.
ఆధునిక నగర నిర్మాత
427 ఏళ్ల క్రితమే నగరం ప్రజల సౌకర్యార్థం నిర్మించిన భవనాలు, ఉద్యానవనాలతో ప్రణాళిక ప్రకారం సుందర నగరాన్ని నిర్మించిన ఘనత ముహ్మద్ కులీ కుతుబ్‌షాకు దక్కుతుంది. పాలనా దక్షత, దార్శనికత సాహిత్య రంగాల్లో మేటిగా నిలిచిన ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించిన మహ్మద్ కులీ కుతుబ్ షా 47 ఏళ్ల వయస్సులో 1612 ఏప్రిల్ 11న కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన సమాది కుతుబ్ షాహీ టూంబ్స్ ప్రాంగణంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment