
మూసాపేట: సర్పంచ్ ఇంట్లోనే మరుగుదొడ్డి లేదు.. మాకెందుకు అంటూ మండల పరిధిలోని తుంకినీపూ గ్రామ ప్రజలు అధికారులను నిలదీశారు. వంద శాతం ఓడీఎఫ్ సాధించాలన్న లక్ష్యంతో అధికారులు పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు తుంకినిపూ గ్రామానికి ఎంపీడీఓ నర్సింహారావు, ఈఓఆర్డీ ప్రభాకర్ తదితరులు వెళ్లారు.
ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడగా.. పలువురు ఎదురుతిరిగారు. సర్పంచ్ ఇంట్లోనే మరుగుదొడ్డి లేదని.. మేమేందుకు కట్టుకోవాలని అడగడంతో అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మమ్మ అధికారుల ముందే గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. ‘నా ఇంటి విషయం మీకెందుకు’ అని అడగడంతో అధికారులు ఎవరికీ సర్దిచెప్పలేకపోయారు.