
సాక్షి, సిటీబ్యూరో: నవరాత్రి ఉత్సవాల కోసం ఖైరతాబాద్ గణనాథుడు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాడు. ఏటా అద్భుతమైన వైవిధ్యంతో, ఎన్నెన్నో ప్రత్యేతలతో, మరెన్నో విశేషాలతో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ మహాగణపతి 64వ ఏట సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా కనువిందు చేయనున్నాడు.
ప్రత్యేకతలెన్నో..
ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది ఏడు ముఖాలు, 14 చేతులు, ఏడు మూషికాలు, ఏడు సర్పాలు, ఏడు గజాలతో పాటు శ్రీనివాసుడు, లక్ష్మీ, శివపార్వతులు, బ్రహ్మ, సరస్వతి, గరుత్మంతుడు, నారద మహర్షి, హోమం చేస్తున్న రుషుల విగ్రహాలు ప్రధాన విగ్రహానికి కుడి, ఎడమ వైపులా ప్రతిష్ఠించారు. ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో ఈ అందమైన విగ్రహం ఆవిష్కృతమైంది. ఈ ఏడాది విగ్రహం బరువు కూడా బాగా పెరిగింది. గత సంవత్సరం 60 అడుగుల విగ్రహాన్ని రూపొందించగా ఈ సారి 57 అడుగులకే పరిమితమయ్యారు. 28 అడుగుల వెడల్పుతో భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. మహాగణపతి బరువు సుమారు 45 టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఈ విగ్రహం రూపకల్పన కోసం 15 టన్నులకుపైగా ఇనుము, 30 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ పారిస్, 10.5 టన్నుల క్లే వినియోగించారు. 2450 కిలోల కొబ్బరి పీచు, 9450 వెల్డింగ్ రాడ్‌లను వినియోగించారు. విగ్రహాన్ని అందంగా అలంకరించేందుకు 500 లీటర్‌ల రంగులను వాడారు. 1750 కిలోల ఫినిషింగ్ పౌడర్‌ను వినియోగించారు. సుమారు 190 మందికిపైగా కళాకారులు, సిబ్బంది ఈ మహాయజ్ఞంలో భాగస్వాములయ్యారు.
నేటి ఉదయంమొదటి పూజతోవేడుకలు ప్రారంభం..
ఖైరతాబాద్ గణనాథుడి ఉత్సవాలు గురువారం ఉదయం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు పద్మశాలీ సంఘం ప్రతినిధులు పోచంపల్లి నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలు, కండువా సమర్పించి పూజలు చేస్తారు. అనంతరం ఉదయం11.52 గంటలకు మొదటి పూజ ప్రారంభమవుతుంది. కాకినాడ శ్రీ పీఠం స్వామీజీ పరిపూర్ణానందస్వామి ఈ తొలిపూజలో పాల్గోనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం హాజరయ్యే గవర్నర్ నరసింహన్ దంపతులు ఈసారి వేడుకలు రావడం లేదు. గవర్నర్ మాతృమూర్తి కన్నుమూయడంతో ఆయన వేడుకలకు రాలేకపోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు ఈ సంవత్సరం కూడా తాపేశ్వరం లడ్డూ ఏర్పాటు చేయడం లేదు. స్థానికంగా తయారు చేసే 50 కిలోల లడ్డూను ప్రసాదంగా అలంకరిస్తున్నారు.
10 అడుగుల అంబికా అగరుబత్తులు
ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతికి 11రోజుల పాటు వెలుగుతూ ఉండేందుకు అంబికా దర్బార్ బత్తి వారు సమర్పించే 10 అడుగుల అగరుబత్తులను ఈ సంవత్సరం కూడా అందజేస్తున్నట్లు అంబికా దర్బార్‌బత్తి టెక్నికల్ డైరెక్టర్ అంబికా రామాంజనేయులు, మార్కెటింగ్ మేనేజర్ మహేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment